Herbal Hair Pack Homemade: ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా ఎంతో మంది జుట్టు రాలిపోవడం, వెంట్రుకలు తెల్లబడడం.. వంటి సమస్యలతో బాధడుతున్నారు. దీంతో జుట్టు ఆరోగ్యం కోసం మార్కెట్లో లభించే అనేక మందులు వాడుతుంటారు. అయితే, ఇలాంటి వారు ఉసిరి, బృంగరాజుతో చేసి హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే మంచి ఫలితం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిని వారానికి ఒకసారి వాడితే వెంట్రుకలకు ఉన్న సమస్యలు తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ గాయత్రీ దేవి అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- రెండు చెంచాల ఉసిరి చూర్ణం
- 50 గ్రాముల కరక్కాయ చూర్ణం
- 50 గ్రాముల తానికాయ చూర్ణం
- 50 గ్రాముల బృంగ రాజు చూర్ణం
- 50 గ్రాముల బ్రాహ్మి చూర్ణం
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో ఉసిరి, కరక్కాయ, తానికాయ, బృంగ రాజ, బ్రాహ్మి చూర్ణం వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
- నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వీటిని ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి.
- ఆ తర్వాత 45 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని నానబెట్టుకోవాలి. అనంతరం తల మొత్తానికి బ్రష్ సాయంతో ప్యాక్‌లాగా వేసుకోవాలి.
- సుమారు 40 నిమిషాల పాటు అలాగే తలకు పెట్టుకుని.. తర్వాత షాంపూలు వాడకుండా కేవలం నీటితో స్నానం చేయాలి.
- ముందు రోజు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత రోజు దీనిని హెయిర్ ప్యాక్‌లాగా వేసుకోవాలని సూచిస్తున్నారు.
ఉసిరి: ఉసిరి జుట్టకు మంచి టానిక్‌లాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా శరీరంలోని కణాలు సరిగ్గా పనిచేయడానికి.. వెంట్రుకలకు ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
కరక్కాయ: జుట్టు రాలకుండా ఉండేందుకు కరక్కాయ చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా నల్ల రంగును ఇచ్చే సహజ డైగా పనిచేస్తుందని అంటున్నారు. జిడ్డు జుట్టు, డాండ్రఫ్ సమస్యల పరిష్కారానికి ఇది బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
తానికాయ: వెంట్రుకలకు తానికాయ మంచి టానిక్‌లాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా జుట్టు నెరసిపోకుండా సహజ సిద్ధంగానే మెరుపును ఇవ్వడంలో సాయం చేస్తుందని వివరిస్తున్నారు.
బృంగ రాజ: దీనిని మన తెలుగులో గుంట గలగర అని పిలుస్తుంటారు. ఇది జుట్టుకు మంచి టానిక్‌లాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. వెంట్రుకలు రాలకుండా, మృదువుగా, ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుందని వివరిస్తున్నారు.
బ్రాహ్మి: తలలో ఉన్న వేడిని తగ్గించి.. చల్లదనాన్ని అందిస్తుందని గాయత్రీ దేవి చెబుతున్నారు. ఫలితంగా వెంట్రుకలకు ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి టానిక్‌లాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
షుగర్, కిడ్నీ పేషెంట్స్ "గుండె" ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!
మీ గోళ్లు పసుపు రంగులోకి మారాయా? - అది "ఎల్లో నెయిల్ సిండ్రోమ్" కావొచ్చట! - పరిశోధనలో తేలిందిదే!