PhD Student Death Case Update : తండ్రి చేసిన అప్పునకు తనను బలి చేశారంటూ గురువారం సూసైడ్ చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీప్తిని మానసికంగా వేధించిన అనిత, ఆమె తండ్రి సోమయ్యతో పాటు దీప్తి తండ్రి సంగీతరావును నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనిత భర్తైన కానిస్టేబుల్ అనిల్, ఆమె సోదరుడు సైదులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
హబ్సిగూడలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లో ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని దీప్తిని వేధించడంతో మనస్తాపానికి గురై గురువారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ అనిల్, సైదులును కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
నాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పులివర్తి దీప్తి(28) ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి సంగీతరావు ఐఐసీటీలోనే పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకు డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న బెల్లా అనిత్‌తో పరిచయం ఉంది. అనిల్ భార్య అనితకు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తామని సంగీతరావు వారి వద్ద 15లక్షలు తీసుకున్నారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో అనిల్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సంగీతరావును అడిగాడు.
అంతటితో ఆగకుండా దీప్తిని కూడా డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. తన తండ్రికి తాను దూరంగా ఉంటున్నానని తనకు సంబంధం లేదని చెప్పినా వినలేదు. ఆమెపై చీటింగ్ కేసు పెట్టడంతో పాటు సివిల్ కేసు వేయడంతో దీప్తి మనస్తాపానికి గురైంది. గురువారం ఈ కేసులతో పోరాడటం తన వల్ల కాదంటూ రాత్రి 10 గంటల సమయంలో సెల్ఫీ వీడియో తీసి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది, ఆమె ఫోన్‌ను చెక్ చేయగా సెల్ఫీ వీడియో బయటపడింది.
పదో తరగతి విద్యార్థుల ర్యాగింగ్! - ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
'తగలబెట్టారా.. అగ్నిప్రమాదమా ?' - మిస్టరీగా మిగిలిన ఇంటర్ విద్యార్థిని మృతి