Telangana Weather Report : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే గత మూడు రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
పొగమంచు ఏర్పడే అవకాశం : రాబోయే 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాగల ఐదు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నట్లు చెప్పింది. నిన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వద్ద నైరుతి దానికి ఆనుకొని ఉన్న పరిసర పశ్చిమ- మధ్య బంగాళాకాతంలో కొనసాగిన చక్రవాతపు ఆవర్తనం ఈరోజు బలహీనపడిందని తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో భారీగా ఈదురుగాలులు - ఇవాళ, రేపు తేలిక నుంచి మోస్తరు వర్షాలు