Best Tips to Protect Heart Health : ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చిన్న వయసులో వివిధ దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధుమేహం. అయితే, డయాబెటిస్ వచ్చాక షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ అదుపులో లేకపోతే కిడ్నీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే హై బ్లడ్ షుగర్ అనేది మూత్రపిండాలు, గుండెలో ఉండే రక్త నాళాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఇది చివరికి కిడ్నీ, గుండె సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు.
అలాగే, కిడ్నీ సమస్యలు ఉన్నవారూ గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా రక్తపోటును పెంచుతుంది. ఫలితంగా ఇది గుండెపై ఒత్తిడిని పెంచి వివిధ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు. ఇంతకీ, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
షుగర్ అదుపులో ఉంచుకోవాలి : గుండె సమస్యల ముప్పు తగ్గాలంటే ముందుగా డయాబెటిస్ పేషెంట్స్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నారు డాక్టర్ రమేష్.
బీపీ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి : షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు. లేదంటే ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మందులు సరిగ్గా వేసుకోవడం : డయాబెటిస్, కిడ్నీ జబ్బులను ఎదుర్కొనే వారిలో చాలా మంది వారు వేసుకునే మందుల విషయంలో అజాగ్రత్త వహిస్తుంటారు. ఒక్కోసారి మందులు వేసుకోవడం కూడా మరచిపోతుంటారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు సూచించిన విధంగా మందులు వాడడం చాలా అవసరమంటున్నారు.
ధూమపానం మానేయాలి : షుగర్, కిడ్నీపేషెంట్స్ స్మోకింగ్ అలవాటు ఉంటే వీలైనంత త్వరగా మానుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఈ అలవాటు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట. కాబట్టి, ధూమపానానికి దూరంగా ఉండడం బెటర్ అంటున్నారు.
రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ : ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడే వారు తీసుకోవాల్సిన టీకాలు, మందులపై సరైన అవగాహాన కలిగి ఉండి కరెక్ట్ టైమ్‌లో తీసుకునేలా జాగ్రత్త పడాలి.
వీటన్నింటితో పాటు ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు తక్కువగా తీసుకోవడం, తీపి పదార్థాలు తీసుకోవడం వీలైనంత తగ్గించుకోవాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే గుండెకు సంబంధించిన సమస్యలను చాలావరకూ రాకుండా చూసుకోవచ్చంటున్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా కిడ్నీ, షుగర్ పేషెంట్స్ పైన పేర్కన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
హార్ట్ ఎటాక్ తెల్లవారుజామునే ఎందుకు వస్తుందో తెలుసా? గుండెపోటు వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలట!
గుండె జబ్బు నుంచి క్యాన్సర్ దాకా - డ్రాగన్ ఫ్రూట్‌తో అడ్డుకోవచ్చట!