Yellow Nail Syndrome Symptoms and Causes : గోళ్లు మన వేళ్లకు అందమైన ఆభరణాలుగా కనిపించడమే కాదు ఆరోగ్యానికి ఆనవాళ్లు కూడా. వీటిలో కనిపించే ప్రతి చిన్న మార్పు బాడీలో తలెత్తే అనారోగ్యం తాలూకు సంకేతమేనంటారు వైద్యులు. అయితే, ప్రతి ఒక్కరిలో గోళ్ల విషయంలో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. అంటే కొందరిలో గోళ్లు పెళుసుగా మారి వాటంతట అవే విరిగిపోవటం, గోళ్లపై మచ్చలు, సన్నటి గీతలు ఏర్పడడం వంటివి జరుగుతుంటాయి. ఇంకొందరిలో "ఎల్లో నెయిల్ సిండ్రోమ్" అనే సమస్య కూడా తలెత్తుతుంటుంది. అసలేంటి ఎల్లో నెయిల్ సిండ్రోమ్? దాని లక్షణాలేంటి? అందుకు కారణాలేంటి? పరిశోధనలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొందరిలో గోళ్లు పసుపు రంగులో కనిపిస్తుంటాయి. దీన్నే "ఎల్లో నెయిల్ సిండ్రోమ్(వైఎన్‌ఎస్)" అని పిలుస్తారు. ఇది చాలా అరుదైన వ్యాధి. కేవలం నెయిల్స్ పసుపు రంగులో ఉండడమే కాకుండా మందంగా ఉన్న గోళ్లు, లింఫెడెమో, క్రానిక్ లంగ్ డిసీజ్ వంటి లక్షణాలు కూడా ఎల్లో నెయిల్ సిండ్రోమ్‌లో ప్రధానంగా కనిపిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఈ సమస్య తలెత్తడం వెనుక దాగి ఉన్న ప్రధానమైన కారణాన్ని ఇటీవల జరిపిన ఓ రీసెర్చ్‌లో పరిశోధకులు కనుగొన్నారు.
ఆ రీసెర్చ్ "అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్"లో ప్రచురితమైంది. జెనెటిక్స్ ఇన్‌స్టిట్యూట్, జెనోమిక్స్ సెంటర్, టెల్ అవీవ్ సౌరస్కీ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు, సహచరులు ఈ పరిశోధనను జరిపారు. ఎల్లో నెయిల్ సిండ్రోమ్ రోగుల జెనెటిక్ సీక్వెన్సింగ్, జీన్స్, ప్రొటీన్ ఎక్స్ప్రెషన్ డేటా ఆధారంగా నిర్వహించారు. అందులో తేలిందేమిటంటే ప్లానార్ సెల్ పోలారిటీ(PCP) పాత్వేలోని లోపాలే ప్రధానంగా ఎల్లో నెయిల్ సిండ్రోమ్కి దారితీస్తున్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా దాని పుట్టుకతో వచ్చిన రూపంలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నట్లు గుర్తించారు.
ఈ పరిశోధనలో భాగంగా పుట్టుకతో వచ్చిన వైఎన్‌ఎస్(Congenital YNS) ఆరుగురు వ్యక్తులు, అప్పుడప్పుడు గోళ్లు పసుపు రంగులోకి మారే వైఎన్‌ఎస్(Sporadic YNS) ఐదుగురు వ్యక్తుల నుంచి జెనెటిక్ డేటాను తీసుకొని విశ్లేషించారు. అప్పుడు cYNS రోగులలో వారి మొదటి లక్షణాలు జననానికి ముందు లేదా పుట్టిన వెంటనే కనిపించాయి. అదే sYNS ఉన్నవారిలో లక్షణాలు కనిపించడానికి కనీసం 12 సంవత్సరాలు పడుతుందని కనుగొన్నారు. ఏదేమైనప్పటికీ YNS ఉన్న చాలా మంది రోగులలో పసుపు, మందం గోళ్లు, ఊపిరితిత్తుల వ్యాధులు ప్రధానంగా కనిపించే లక్షణాలని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా ప్లానార్ సెల్ పోలారిటీ ఆర్గనైజేషన్‌లో తలెత్తే లోపాలే ఎల్లో నెయిల్ సిండ్రోమ్కి కారణమవుతాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
హెచ్చరిక : మీరు తరచుగా నెయిల్ పాలిష్ వాడుతున్నారా? - మీ ఆరోగ్యానికి ఏం జరుగుతుందో తెలుసా?
మీ గోళ్లు ఏ కలర్లో ఉన్నాయి? - ఆ రంగులోకి మారితే ప్రమాదం ముంచుకొస్తోందని అర్థం!