New Year Cyber Alert : ఇంకో నాలుగు రోజుల్లో నూతన ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటల నుంచే స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతాం. ఇప్పుడు ఈ కొత్త సంవత్సర వేడుకలను సైబర్ నేరగాళ్లు వారికి అనువుగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇదే తడవుగా దోచుకునేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నూతన సంవత్సవ శుభాకాంక్షలను సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని చెబుతూ, వీటి కోసం ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి, మీ వివరాలు నమోదు చేస్తే చాలని సెల్ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆ లింక్‌పై పొరపాటున క్లిక్ చేశారో ఇక మీపని గోవిందా.
సైబర్ దొంగలు ఇలా ప్రతి పండగను, సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూ ఇయర్ సెలబ్రెషన్స్‌లో నూతన సంవత్సర శుభాకాంక్షలకు ప్రత్యేకం అంటూ ఉన్నదంతా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఉన్నవాళ్లు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారి చేతికి చిక్కుతారు. తర్వాత మీ రహస్య సమాచారం అంతా సైబర్ కేటుగాళ్లకు చేరి వారి చేతిలో కీలుబొమ్మలు అవుతారు.
సెల్ఫోన్లో ఉన్న రహస్య సమాచారం అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఖాతాలలోని డబ్బులు సైబర్ కేటుగాళ్లు కాజేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే తెలియని నంబరు నుంచి న్యూ ఇయర్ శుభాకాంక్షలు భిన్నంగా చెప్పాలనుకుంటే మెసెజ్ లోపల లింక్ క్లిక్ చేయమంటారని, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(APK) ఫైల్స్ రూపంలో మెసెజ్‌లు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మీ సమాచారం మొత్తం సైబర్ కేటుగాళ్ల చేతిలో : ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి మీ ఫోన్లోకి చొరబడిందంటే అందులోని మీ సమాచారం మొత్తం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. ఏవైనా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, వీడియోలు, ఇతర ఫైల్స్ అన్నింటినీ వారు తీసేసుకుంటారు. కావున నూతన సంవత్సర సందేశాల విషయంలో అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున సైబర్ నేరగాళ్లు సందేశాలను పంపుతున్నారని, మరో రెండు, మూడు రోజుల్లో ఈ దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కావున ప్రజలందరూ హ్యాపీగా నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే అలాంటి మెసెజ్‌ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఓపెన్ చేయకపోవడమే ఉత్తమం.
ఈ ఒక్క సూత్రం పాటించారంటే - మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరు
కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో వెతుకుతున్నారా? - ఐతే మోసపోవటం పక్కా!