Griha Jyothi Schem In Telangana : కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఆరుగ్యారెంటీల్లో ఒక్కటైనా గృహజ్యోతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు గత నెల 27న ప్రారంభించారు. నిరుపేదలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే సదాశయంతో తెచ్చిన ఈ పథకం అమలుకు ప్రభుత్వం భారీ కసరత్తే చేసింది. మీటర్ రీడర్లు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేర్పులు చేసి ఇంటింటికీ వెళ్లి తెల్ల రేషన్ కార్డు, ఆధార్, మొబైల్ నంబర్ వివరాలను మీటర్ రీడింగ్ మిషన్లలో నిక్షిప్తం చేశారు.
గృహజ్యోతి అమలుకు సంతకం అంటూ ఎకరా భూమిపై కన్నేసిన ఉపాధి హామీ సహాయకుడు
Griha Jyothi : కసరత్తు అనంతరం తెల్లరేషన్ కార్డుదారులనే అర్హులుగా తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరిలో 200ల యూనిట్లలోపు కరెంట్ వాడిన వినియోగదారులు 39.90లక్షల వరకు ఉంటారని డిస్కంలు తేల్చాయి. ప్రజాపాలనలో 81 లక్షలకు పైగా కుటుంబాలు గృహజ్యోతి (Griha Jyothi Schem) కింద ఉచిత విద్యుత్‌కు దరఖాస్తులు సమర్పించాయి. వాటిని పరిశీలించిన అధికారులు తొలి దశలో 39.90లక్షల మంది అర్హులని డిస్కంలు తేల్చారు. జీరో బిల్లులు పొందిన గృహిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు డబ్బులను ఇతర అవసరాలకు వినియోగిస్తామని చెబుతున్నారు.
గృహజ్యోతి పథకం : రేషన్ కార్డు, ఆధార్ కార్డులు వినియోగదారుల నుంచి సేకరించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున అర్హుల సంఖ్య మరింత పెరగుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆహార భద్రత కార్డులకు ఆధార్ అనుసంధానమై, యూనిక్ సర్వీస్ కనెక్షన్ ఉంటే ఆ వివరాలు పొందు పరిచి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. జీరో విద్యుత్ బిల్లు (Zero Current Bill) రాని అర్హులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు నకళ్లతో విద్యుత్ రెవెన్యూ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గృహజ్యోతి పథకం అమలు కోసం తొలుత కర్ణాటక తరహాలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావించినా తర్వాత ఆలోచనను విరమించుకుంది.