Grandson killed grandmother :చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు, సెల్ ఫోన్ కొనడం కోసం సొంత నానమ్మను హత్య చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. సెల్ ఫోన్ కొనడానికి డబ్బుల కోసం వృద్దురాలి మెడలో ఉన్న బంగారాన్ని చోరీ చేసి అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తమ అమ్మ కనిపించడం లేదంటూ ఆమె చిన్నకుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో, నాగమ్మ అనే వృద్దురాలి హత్య ఘటన వెలుగు చూసింది.
సెల్ ఫోన్ డబ్బుల కోసం నానమ్మను ఆమె మనువడు దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన బజారి కుటుంబంతో కలిసి గత కొంత కాలంగా గుంటూరులో ఉంటున్నాడు. అతని కుమారుడు వెంకటేష్ (19) గత కొంత కాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.
ఈ నేపథ్యంలో కొత్త సెల్ ఫోన్ కొనాలన్న ఆశ కలిగిన వెంకటేష్, పెద్దమర్రివీడు గ్రామంలో ఉంటున్న తన నానమ్మ అయిన నాగమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాలు ఉన్న బంగారు గొలుసు కొట్టేయాలనుకున్నాడు. పథకం ప్రకారం, వెంకటేష్ గ్రామంలో ఉంటున్న తన నానమ్మ నాగమ్మ (84) దగ్గరికి వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగమ్మ గొలుసు చోరీ చేసే ప్రయత్నం చేశాడు. ప్రతిఘటించిన నాగమ్మను గొంతు నులిమి చంపాడు.