GHMC Bus Shelter Scam In Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని (Ghmc) ప్రకటనల విభాగంలో భారీ అవినీతి బయటపడింది. ఆ విభాగంలో పనిచేస్తున్న కొందరు అధికారులు యాడ్ ఏజెన్సీలతో కుమ్మకై అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. బస్‌షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై ప్రకటనలకుఅక్రమంగా అనుమతి ఇస్తూ గత ఐదేళ్లుగా సుమారు వెయ్యికోట్ల రూపాయలు దండుకున్నట్లు సమాచారం. ఇటీవల పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై నగర బీజేపీ కార్పొరేటర్లు మండిపడగా మేయర్ హౌస్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1500లకు పైగా బస్ షెల్టర్లను నిర్మించారు. వాటిలో ఎక్కువ బస్ షెల్టర్లు బస్సులు తిరగని మార్గాల్లోనే కనిపిస్తుంటాయి. ప్రయాణికుల అవసరం కంటే వాటి ద్వారా వచ్చే ఆదాయంపైనే అధికారులు దృష్టిపెట్టారు. బస్ షెల్టర్ల నిర్వహణ, ప్రకటనలకు టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించారు. ఐతే టెండర్‌లో ఎన్ని ప్రైవేట్ సంస్థలు పోటీపడినా రెండు సంస్థలకు మాత్రమే టెండర్లు దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులపై కార్పొరేటర్ల ఆగ్రహం - జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
" దాదాపు 1000 కోట్ల జీహెచ్ఎంసీ నిధులను పక్కదారి పట్టించిన కంపెనీల మీద చర్యలు తీసుకోలేదు. మేయర్ వెంటనే దీనిపై సమావేశం ఏర్పాటు చేయాలి. వాణిజ్య ప్రకటనల పేరుతో దందా చేసి కోట్లాది రూపాయల దోచుకున్న వారు తమ ఏజెన్సీలను కాపాడేందుకే ఇప్పుడు బస్ షెల్టర్‌ను తీసేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి అవినీతి తిమింగలాలను బయటపెట్టాలి. దీనిపై ఏసీబీ విచారణ చేపట్టాలి." - మధుసూదన్ రెడ్డి, బీజేపీ కార్పొరేటర్