Fine Rice Will Distribution in Telangana :తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రతి లబ్ధిదారుడికి ప్రస్తుతం 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటి స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో అధిక ధర పలుకుతున్న నేపథ్యంలో ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, తిరిగి నిరుపేదలకే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. శనివారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు 'పేదలకు సన్నబియ్యం పంపిణీ' అంశం చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశం :తెలంగాణలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు కార్డుల జారీ ప్రక్రియపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం గుర్తించింది. రేషన్ కార్డుల్లోని లబ్ధిదారులు 281.71 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు. వీరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమై ఉంది. పంపిణీకి సుమారు 1.70 కోట్ల టన్నుల బియ్యం అవసరం అని అంచనా వేస్తున్నారు. 2 నెలలు అయితే ఇప్పుడు మరపట్టిన బియ్యం ముద్ద కాకుండా ఉంటాయని, అప్పటి నుంచే పంపిణీ చేపడితే బాగుంటుందన్న సూచనలు వచ్చినట్లు సమాచారం.