Road Accident in Anantapur in AP : ఏపీలో అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న కూలీల ఆటోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లాలోని కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన కొంత మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నెలో పని కోసం వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను ఢీ కొట్టింది.
ఘటనాస్థలిలోనే ఇద్దరు మృతి చెందగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతులు తాతయ్య (55), చిననాగమ్మ (48), రామాంజనమ్మ (48), పెదనాగమ్మ (60), కొండమ్మ, జయరాముడు, చిననాగన్న. మృతులంతా పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ, డీఎస్పీ వెంకటేశ్వరులు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారులు మృతి :మరోవైపు గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం చెందారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి, ఆయన భార్య సురేఖ, కుమారుడు హరినాథ్ రెడ్డి కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాజీపేట వద్ద ఎదురుగా లారీ వచ్చి ఢీ కొట్టడంతో ముగ్గురూ గాయపడ్డారు.