Ex Minister Srinivas Goud Fires On Congress Govt : పాలమూరు జిల్లాలో పేదలు, దివ్యాంగులకు చెందిన ఇళ్లను గురువారం రోజున అధికారులు కూల్చివేయడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని నిలదీశారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలా చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. నోటీసులు లేకుండా పేదల ఇల్లు ఎలా కూలుస్తారు అని ప్రశ్నించారు.
నోటీసులు లేకుండా పేదల ఇళ్లు ఎలా కూల్చుతారు? : డబ్బున్న వాళ్లకు నోటీసులు ఇస్తూ, పేదలను నోటీసులు లేకుండా దౌర్జన్యంగా కూలుస్తున్నారని ఆరోపించారు. పేదలపై మీ ప్రతాపం ఏంటని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇదేనా కాంగ్రెస్ మార్పు పాలన అంటూ ఘాటుగా స్పందించారు. అక్రమ నిర్మాణాలకు తామేమి సపోర్ట్ చేయడం లేదని, కాకుంటే న్యాయం అందరికీ ఒకే విధంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కూల్చిన ఇళ్ల స్థానంలో తిరిగి కట్టించి వాళ్లకు ఇవ్వాలని, లేదంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకోవాలని కోరారు. పేదల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, వాళ్లకి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
"మహబూబ్ నగర్‌లోని అంధుల కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి అంధుల ఇళ్లు కూల్చివేయటం చాలా దురదృష్టకరం. అంధులు వేడుకున్నా కూడా పోలీసులు వారిని వదలలేదు. తమ సామాగ్రిని తీసుకుంటామని బ్రతిమిలాడినా సమయం ఇవ్వలేదు. మానవత్వం ఉన్న ఎవరు కూడా చేయనటువంటి పని అది. అవేమైనా చెరువులో కట్టుకున్నారా? నాలాలో నిర్మించారా? నాలుగేళ్ల పాటు పెన్షన్ డబ్బులతో చిట్టీలు వేసుకొని నిర్మించుకున్న ఇల్లు అవి. అంతేకాని కోట్ల విలువైన భూముల్లో కబ్జా చేసి కట్టినవి కాదు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, ముందు పట్టాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి."- శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి