Driving Licence Same As Old System : డ్రైవింగ్ లైసెన్సులను పాత పద్ధతిలో యథావిధిగా రవాణాశాఖ ఆఫీస్ల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు జూన్ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్లు తొలుత భావించినప్పటికీ, అందుకు తగినట్లు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో పాత విధానంలోనే లైసెన్సులు జారీ చేయనున్నారు.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వర్గాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. పాత పద్ధతిలోనే తొలుత లెర్నర్ లైసెన్సు కోసం స్లాట్ బుక్ చేసుకొని రాత పరీక్షకు సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత నిర్ణీత గడువులో లైసెన్సు కోసం డ్రైవింగ్ టెస్టులో పాల్గొని పాసైతేనే, పూర్తి లైసెన్సు అందించనున్నారు. కేంద్రం తొలుత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే డ్రైవింగ్ లైసెన్సు కోసం ఆర్టీవో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
Driving Licence New Rules Update :అందుకోసం ఈ బాధ్యతలను ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లకు కట్టబెడుతున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అందుకు ఆయా డ్రైవింగ్ స్కూళ్లు ఆర్టీఏ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని లైసెన్సులు తీసుకోవాలి. ఆయా స్కూళ్లలో తొలుత నోటిఫికేషన్ అప్లై చేసుకొని టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తే, సంబంధిత స్కూళ్లు వారికి ధ్రువపత్రాన్ని జారీ చేస్తాయి. వాటితో ఆర్టీవో కార్యాలయంలో లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాలి.