DrinkingWater Problem In Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 80 వేలకు పైగా జనాభా నివసిస్తుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలో వేసవి ప్రారంభంతోనే ప్రజలకు మంచి నీటి కష్టాలు (Water Problem) ప్రారంభమయ్యాయి. బిందెడు నీటి కోసం నల్లాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మల్లెబోయిన్‌పల్లి నుంచి కావేరమ్మపేట ఓవర్ హెడ్ ట్యాంకుకు నీటిని సరఫరా చేసే మూడు పంపులు ఇటీవల మరమ్మతులకు గురయ్యాయి.
మిషన్ భగీరథవిభాగం అధికారులు ఒక పంపును మాత్రమే మరమ్మతు చేసి మిగతా రెండింటిని వదిలేశారు. అప్పటినుంచి ఒక దానితోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో కావేరమ్మ పేట హౌసింగ్ బోర్డు పరిథిలోని పలు కాలనీల్లో వారం రోజులుగా మంచినీరు సరఫరా కావడం లేదు. కొన్ని ప్రదేశాల్లో పైపులైను లీకేజీ కారణంగా నీరు వృధా పోతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు.
"నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ 40 కుటుంబాలు ఉన్నాయి. నీళ్ల ట్యాంకర్లు లేక అనేక అవస్థలు పడుతున్నాం. నీళ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవికూడా ఇంటికి పది బిందలు మాత్రమే వస్తున్నాయి. నీళ్లు లేకపోవడం వలన కనీస అవసరాలు తీర్చుకోలేక పోతున్నాం. నీటి సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యలు తీర్చాలి. " - స్థానికులు, జడ్చర్ల మున్సిపాలిటీ
Drinking Water Problems: గొంతెండుతున్న శివారు కాలనీలు.. అధికారుల అలసత్వంతో జనం అవస్థలు