Onion Tomato Chutney Recipe : కొన్ని పచ్చళ్లు టిఫెన్ తినడానికైనా, భోజనం చేయడానికైనా అద్దిరిపోయేలా ఉంటాయి. అలాంటి ఓ సూపర్ రెసిపీనే మీకోసం తీసుకొచ్చాం. అదే ఉల్లిపాయ టమటా పచ్చడి. దీనికోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే పదే పది నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది! వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతమని చెప్పుకోవచ్చు. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు చపాతీ, ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫెన్లోకైనా కూడా సూపర్‌గా ఉంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఉల్లిపాయలు - 2 (పెద్ద సైజ్‌వి)
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- టమాటా - 1 (పెద్ద సైజ్ది)
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - తగినంత
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- పోపు గింజలు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక జీలకర్ర, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
- అనంతరం మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ, టమాటా ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికంచుకున్నాక కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లార్చుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు మంచిగా వేగాక స్టౌ ఆఫ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఆఖర్లో కొద్దిగా సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఉల్లి టమాటా పచ్చడి" రెడీ!
ఇవీ చదవండి :
కూరగాయలు లేనప్పుడు - 5 నిమిషాల్లోనే ఇలా "ఉల్లిగడ్డ కారం" చేసుకోండి! - వేడివేడి అన్నంలో తింటే అమృతమే!