Best Home Remedies for Dandruff : చలికాలం వచ్చిందంటే చాలు చర్మం విషయంలో మాత్రమే కాకుండా జుట్టు విషయంలోనూ ఎన్నో సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా ఈ కాలంలో కురుల సంరక్షణ విషయంలో చాలా మందిని వేధించే సమస్యల్లో ఒకటి చుండ్రు. ఈ టైమ్‌లో స్కిన్ మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా మారుతుంటుంది. ఫలితంగా చుండ్రు సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ఫేస్‌పై చిన్న చిన్న మొటిమలు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే, కొన్ని నేచురల్ టిప్స్ పాటిస్తే చలికాలంలో వేధించే చుండ్రు సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.
చలికాలం చాలా మందికి తలస్నానం చేయాలనిపించదు. కానీ, వారానికి రెండు సార్లు అయినా తప్పక చేయాల్సిందే. లేదంటే మాడు మీద దుమ్ము పేరుకుపోయి ఇన్ఫెక్షన్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే చలికాలం చుండ్రు, ఇన్ఫెక్షన్ సమస్యలకు చెక్ పెట్టడంలో ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో కొద్దిగా వేపాకు, కలబంద, మెంతులను వేసి పదినిమిషాలు మరిగించాలి. ఆపై వాటర్ వడకట్టుకొని అందులో మీరు వాడే షాంపూని కలిపి తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు మెత్తగా మారుతుంది, చుండ్రు బెడదా తప్పుతుందంటున్నారు.
చుండ్రు సమస్య ఎంతకీ తగ్గట్లేదా? - బిర్యానీ ఆకులతో ఇలా చేస్తే మళ్లీ ఆ ప్రాబ్లమే ఉండదు!
తలకు నూనె పెట్టి, ఆ తర్వాత తలస్నానం చేస్తే కురులకు వచ్చే మెరుపే వేరు. కానీ, చుండ్రు ఉన్నప్పుడు నూనె పెడితే సమస్య పెద్దది అవుతుందని చాలా మంది భయపడుతుంటారు. అలాంటి టైమ్‌లో ఈ చిట్కా ఫాలో అవ్వండి. అదేంటంటే.. పావుకప్పు కొబ్బరినూనెకు అరచెంచా టీట్రీ ఆయిల్ కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాలయ్యాక హెడ్ బాత్ చేస్తే సరి. కురులకు మంచి పోషణా అందుతుంది, టీట్రీఆయిల్‌లోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రుకీ చెక్ పెడతాయంటున్నారు. ఇదే కాదు.. లావెండర్, రోజ్‌మెరీ, పెప్పర్‌మింట్ నూనెలను ట్రై చేసినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
కలబంద గుజ్జులోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువే. ఇవీ మాడు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం తలస్నానానికి అరగంట ముందు కలబంద గుజ్జును మాడు నుంచి కురుల వరకు పట్టిస్తే సరిపోతుంది. లేదంటే తలస్నానం పూర్తయ్యాక మగ్గులో కప్పుచొప్పున వాటర్, యాపిల్ సిడార్ వినెగర్ తీసుకుని కలిపి దాన్ని తలపై పోసుకోవాలి. ఆ తర్వాత 5 నిమిషాలు స్మూత్‌గా మర్దనా చేసి, గోరువెచ్చని నీటితో కడిగేసినా చుండ్రు బాధ తగ్గుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, వాటర్ తగినన్ని తాగకపోవడం, ఒత్తిడి వంటివీ చుండ్రు సమస్యను పెంచేవే. కాబట్టి, వీటిపైనా దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.