Telangana Discoms on Power Revise : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. మూడు కేటగిరీల్లో ఛార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి రూ. 1,200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ చేశాకే ఈఆర్సీ తుది తీర్పు ఇస్తుంది.
లోటును పూడ్చుకునేందుకు సవరణ : అనంతరమే ఛార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజుల సమయం పడుతుంది. రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా వేశాయి. ఈ మొత్తంలో 13వేల 22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలిన 1,200 కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఇస్తున్నట్లు డిస్కంలు ప్రకటించాయి.
ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం 10 వసూలు చేస్తుండగా, 50 రూపాయలకు పెంచడానికి అనుమతించాలని డిస్కంలు కోరాయి. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్లలోపు కరెంటు వాడుకునే ఇళ్లకు ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి స్థిరఛార్జీ పెంపు ఉండదు. రాష్ట్రంలో మొత్తం కోటీ 30 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 యూనిట్లలోపు వాడుకునేవారు 80 శాతానికి పైగా ఉన్నారు.
పరిశ్రమలన్ని ఒకే కేటగిరీ కిందకు : దీని వల్ల ప్రజలపై పెద్దగా స్థిరఛార్జీ పెంపు భారం పడదని డిస్కంలు చెబుతున్నాయి. ప్రస్తుతం హెచ్‌టీ పరిశ్రమల జనరల్ కేటగిరీలో మూడు రకాల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 11 కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకున్న పరిశ్రమ వినియోగించుకున్న కరెంటుకు యూనిట్‌కు 7.65 రూపాయ చొప్పున వసూలు చేస్తున్నారు. 33 కేవీ సామర్థ్యంతో కనెక్షన్ తీసుకుంటే 7.15 రూపాయల చొప్పున, 132 కేవీ అయితే 6.65 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇకపై అన్ని కేటగిరీల పరిశ్రమల నుంచి యూనిట్‌కు 7రూపాయల 65 పైసల చొప్పునే వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. పరిశ్రమల నుంచి కిలోవాట్‌కు 475 చొప్పున వసూలు చేస్తున్న స్థిరఛార్జీని 500 రూపాయలకు పెంచాలని కోరాయి.
ఈ నివేదికను 2023 నవంబరు 30 కల్లా మండలికి ఇవ్వాల్సి ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవ్వలేదు. 2024 జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఈఆర్సీ ఆదేశించినా లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి. దాంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆలస్యానికి 21 లక్షల జరిమానాను డిస్కంల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది. ఏఆర్ఆర్ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు డిస్కంల ఈక్విటీలో నెలకు 0.5 శాతం చొప్పున వసూలు చేస్తామని ఈఆర్సీ చెప్పింది. ఇది కూడా డిస్కంలకు నష్టమేనని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన ఛార్జీల సవరణ ఏఆర్ఆర్ నివేదికను సైతం 2024 నవంబరు కల్లా ఈఆర్సీకి ఇవ్వాలి.
పల్లెలకు ఫ్రీ సోలార్ విద్యుత్ - పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాల్లో అమలు - Free Solar Power To Villages
కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందా?- ఈ టిప్స్ పాటిస్తే సగం డబ్బులు మిగిలినట్లే! - How to Reduce Electricity Bill