Deputy CM Bhatti Vikramarka US Tour: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్‌కు పెట్టుబడులతో తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
గ్లోబల్ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ :అమెరికాలోని లాస్ వెగాస్‌లో జరుగుతున్న మైన్ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ వ్యాప్త వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధుల సమావేశాలలో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్‌ను తమ స్వస్థలంగా భావిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని తెలిపారు.
పెట్టుబడులతో తరలిరావాలి : రాష్ట్రప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని అమెరికన్ కంపెనీల ప్రతినిధులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగరం టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉంటుందన్నారు.