Hotel Rating Cyber Crime In Hyderabad : ఆన్‌లైన్‌లో రెస్టారెంట్, హోటళ్లకు రేటింగ్ ఇస్తూ ఇంట్లో నుంచే ఆదాయం పొందొచ్చని నమ్మిస్తూ సైబర్ నేరాలు చేస్తున్న హైదరాబాదీని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారు మేడ్చల్‌కు చెందిన అతడిని అదుపులోకి తీసుకొని దిల్లీకి తరలించారు. అతడి నుంచి మొబైల్ ఫోన్, సిమ్‌కార్డు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌కు చెందిన లక్కు అఖిలేశ్వర్‌రెడ్డి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు.
దీంతో పాటు మేడ్చల్‌లో స్థానికంగా ఫ్లెక్సీ వ్యాపారం చేస్తున్నాడు. డబ్బు సరిపోక ఇబ్బందులు పడుతున్న అతను తేలిగ్గా సంపాదించాలనుకున్నాడు. తనకు తెలిసిన శివతో కలిసి సైబర్ నేరాలు చేయాలని పథకం వేశాడు. ఆన్‌లైన్‌లో హోటళ్లకు రివ్యూలు ఇస్తే డబ్బులు సంపాదించొచ్చని టెలిగ్రామ్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసాడు. ఎవరైనా సంప్రదిస్తే రివ్యూలు పూర్తి చేయాలంటూ కొన్ని టాస్కులు ఇచ్చాడు.
రివ్యూలు పూర్తి చేస్తే డబ్బులు :ఒక్కో టాస్కులో రివ్యూలు పూర్తి చేస్తే డబ్బు ఖాతాలు జమ చేస్తామని ఆశ చూపించి అమాయక ప్రజల నుంచి డబ్బు వసూలు చేసాడు. దీంతో పాటు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులకు లాభాలు వస్తాయని ప్రచారం చేసి మోసాలు చేసాడు. ఈ తరహాలోనే దిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన అక్షయ్కుమార్సింగ్ను అఖిలేశ్వర్‌రెడ్డి మోసగించాడు. గతేడాది నవంబరు మూడో వారంలో అక్షయ్‌కుమార్ సింగ్ నుంచి రూ.20.16 లక్షలు వసూలు చేసి ఆ తర్వాత స్పందించలేదు. మోసపోయిన బాధితుడి ఫిర్యాదు మేరకు ద్వారక సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.