Cyber Fraud With Fake Mail Ids : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త రకమైన మోసాలకు పాల్పడుతూ కోట్లు కాజేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సైబర్ నేరగాళ్ల బారిన పడింది. ఈ -మెయిల్‌లో ఒకే ఒక్క అక్షరం మార్చేసి సంస్థ నుంచి రూ.5.47 కోట్లను స్వాహా చేశారు. బాలానగర్‌లోని సంస్థ ఎకౌంట్స్ మేనేజర్ దుంపల శ్రీహరి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు.
వివరాలు: 2022 మే 10న మేఘా కంపెనీ సంస్థకు అవసరమైన సామగ్రి కోసం నెదర్లాండ్స్‌లోని ఓ సంస్థకు 14.39 లక్షల యూరోల విలువైన కొనుగోలు ఆర్డర్ ఇచ్చింది. అదే నెల 17న 7.95 లక్షల యూరోల విలువైన మరో ఆర్డర్ ఇచ్చింది. అనంతరం ఒప్పందం ప్రకారం మేఘా కంపెనీ ఆ సంస్థకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తూ పోయింది. అలా చెల్లింపులు చేసిన ప్రతిసారి ఆ సంస్థ ప్రతినిధి నుంచి మేఘాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది.
పాత ఖాతాపై ఆంక్షలున్నాయంటూ మోసం : ఈ క్రమంలో 2024 నవంబరు 29న నెదర్లాండ్స్‌లోని సంస్థ పేరిట మేఘా కంపెనీకి ఒక మెయిల్ వచ్చింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా తమ బ్యాంకు పాత ఖాతాపై ఆంక్షలున్నాయని ఇక నుంచి కొత్త ఖాతాకు సొమ్ము బదిలీ చేయాలనేది ఆ మెయిల్ సారాంశం. ఇక్కడే సైబర్ నేరస్థులు తమ పథకాన్ని అమలు చేశారు. ఒకే అక్షరం తేడాతో ఆ సంస్థ మెయిల్‌ను పోలి ఉన్న మరో నకిలీ మెయిల్‌ను ఆ సంస్థకు పంపించారు.