CPI Leader Balamallesh Passed Away : సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించి ఈసీఐఎల్‌లోని సమీప ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. బాలమల్లేశ్ భౌతికకాయాన్ని యాప్రాల్‌లోని ఆయన నివాసానికి తరలించారు. దీంతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి. దీర్ఘకాలంగా ప్రజా ఉద్యమాల్లో చెరగని ముద్ర వేసిన బాలమల్లేశ్కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలమల్లేశ్ మృతిపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే బాలమల్లేశ్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీపీఐలో అంచెలంచెలుగా ఎదిగిన బాలమల్లేశ్ ప్రజా ఉద్యమాలలో తనదైన పాత్రను పోషించారని కొనియాడారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూపోరాటంలో మల్లేశ్ కీలక పాత్ర పోషించారన్నారు.
విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయాల్లోకి :ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమం నుంచి బాలమల్లేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీపీఐ కార్యదర్శిగా, అఖిల భారత రైతుసంఘం ప్రధాన కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగిన బాలమల్లేశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం బాధాకరమని వామపక్ష నేతలు ఇతర రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాల మల్లేశ్ మృతికి నారాయణ, కూనంనేని సాంబశివ రావు, పలువురు సీపీఐ నేతలు సంతాపం తెలిపారు.
"సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్ రెడ్ గార్డుగా పనిచేసి అంచలంచెలుగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బాలమల్లేశ్ ఎదిగారు. పార్టీలో ఏఐఎస్ఎఫ్ నాయకుడుగా ఆ తర్వాత పార్టీలో వివిధ పదవుల నుంచి జీవితం మొత్తాన్ని పార్టీకే అంకితం చేసిన కామ్రేడ్ బాలమల్లేశ్. ఆయన మామ ఏఆర్ దేవరాజ్ పార్టీలో రాష్ట్ర నాయకుడిగా పని చేశారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీకి కొంత సంక్షోభం వచ్చిన కాలంలో జిల్లా పార్టీని నిలబెట్టడానికి తక్కువ వయసులోనే కృషి చేశారు. పార్టీలో ఏ పని అప్పజెప్పినా వీర సైనికుడిగా పనిని స్వీకరించి పూర్తి చేసేవారు. ఇటీవల సీపీఐ జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికయ్యారు. హనుమకొండలో జరిగిన రాష్ట్ర నిర్మాణ సమితి సమావేశంలో సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బీకేఏంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బీసీ హక్కుల సాధన సమితికి ప్రధాన కార్యదర్శిగా బాల మల్లేశ్ పనిచేస్తున్నారు. అన్ని వామపక్ష పార్టీలను, మేధావులను, సామాజిక కార్యకర్తలను సమన్వయం చేసే విషయంలో అలుపెరగకుండా అందరి తలలో నాలుకలాగా ఉండేవారు. మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాలకు పార్టీ నుంచి నిర్మాణ బాధ్యుడిగా కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శి పోటు ప్రసాదు అంతిమయాత్రలో ఆరోగ్యం బాగోలేదు అంటూనే పాల్గొన్నారు. బాల మల్లేశ్ మృతి సీపీఐ రాష్ట్ర సమితికి తీరని లోటు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి."-కూనంనేని సాంబశివరావు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సీపీఐ సీనియర్ నేత ధూళిపాళ్ల సీతారామచంద్రరావు కన్నుమూత
స్టూడెంట్ లీడర్ నుంచి జాతీయ స్థాయి నేతగా- సీతారాం ఏచూరి ప్రస్థానం - Sitaram Yechury Biography