Congress Focus On TPCC Selection 2024 :మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై త్వరలో ఉత్కంఠ వీడనుంది. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి రావడంతో పదవుల భర్తీలో కదలిక రానుంది. పీసీసీ పదవి కోసం పార్టీలో గట్టి పోటీ ఉంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఎస్సీల నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, బీసీల నుంచి పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పోటీపడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడిపై అధిష్ఠానం దృష్టి సారించింది. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, గద్వాల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, మైనార్టీల నుంచి ఫిరోజ్ ఖాన్, ఎస్టీల నుంచి బాలు నాయక్‌కు పీసీసీ కార్యనిర్వహక అధ్యక్ష పదవులు దక్కే అవకాశం ఉంది.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : మంత్రివర్గ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి దాదాపు బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి వాకిటి శ్రీహరి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రామచందర్ నాయక్‌కు కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మరో రెండు మంత్రి పదవుల్లో ఒకటి మైనార్టీ వర్గానికి, మరొకటి వెలమ సామాజిక వర్గానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఇవ్వొచ్చని పీసీసీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ చీఫ్‌గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మల్‌రెడ్డి రంగారెడ్డి, అద్దంకి దయాకర్‌లో ఎవరో ఒకరికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. మిగతా కార్పోరేషన్ పదవులు కూడా ముఖ్యమైన నేతలతో భర్తీ చేయనున్నట్లు సమాచారం.