CM Revanth Speech at Telangana Formation Day Celebrations 2024 :తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసగించారు. జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఈరోజు అని చెప్పారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
'ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన నాటి ప్రధాని, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ జీవనశైలి స్వేచ్ఛం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ ప్రజల తత్వం. సంక్షేమం ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూస్తే సమాజం సహించదు. మా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇచ్చాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలుకొట్టాం' అని రేవంత్‌రెడ్డి అన్నారు.
సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు : సర్వజ్ఞానులం అన్న భ్రమలు తమకు లేవని రేవంత్ రెడ్డి అన్నారు. అందరి సలహాలు, సూచనలు స్వీకరించి, చర్చించి ముందుకెళ్తామని చెప్పారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని చెప్పారు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందన్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో ఎక్కడ ఉన్నామనేది సమీక్షించుకోవాల్సిన సందర్భమిదని వ్యాఖ్యానించారు. దానికంటే ముందు దశాబ్దిఉత్సవం అనేది మైలురాయి అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.