CM Revanth Reddy Review on Forest Department : రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అటవీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వైవిధ్య ప్రాంతాలను గుర్తించి రెండు విభాగాలు సంయుక్తంగా ప్రాజెక్టుల ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చెప్పారు. అటవీ అందాలు, వన్య ప్రాణులు, వలస వచ్చే విదేశీ పక్షులు, విభిన్న జీవ వైవిధ్యమున్న ప్రాంతాలు, హెరిటేజ్ ప్రదేశాలు, సంస్కృతికి అద్దం పట్టే వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు.
రాష్ట్రంలో అడవు(Forests in Telangana)లతో ముడిపడి ఉన్న ప్రకృతి అందాలను, పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించేలా కృషి చేయాలని అవసరమైతే ప్రత్యేకంగా కన్సెల్టెన్సీలను నియమించి ప్రతిపాదనలు తయారు చేయించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తర తెలంగాణలో కవ్వాల్, దక్షిణ తెలంగాణ వైపు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. వన్య ప్రాణులకు హాని కలిగించకుండా ప్రత్యేక పర్యాటక విధానం తయారు చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాల్లోనే పర్యాటకులు విడిది చేసేలా ఉన్న ప్రాజెక్టులను అధ్యయనం చేసి, అక్కడ అనుసరిస్తున్న రక్షణ, భద్రత చర్యలను రాష్ట్రంలోనూ అమలయ్యేలా చూడాలని చెప్పారు. సచివాలయంలో అటవీ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy Review :కాలుష్య నిబంధనలు, ప్రమాణాలను పాటించే పరిశ్రమలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవం లాంటి సందర్భాన్ని పురస్కరించుకొని జీరో పొల్యూషన్(Zero Polluction) పాటించే సంస్థలకు ప్రశంసా పత్రాలను అందించాలని చెప్పారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకు అందుబాటులో ఉండేలా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలు, అనువైన ప్రాంతాలను పరిశీలించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించి ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి భారీగా జరిమానాలు విధించాలని చెప్పారు.
యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి
ఐఎఫ్‌ఎస్‌లను కేటాయించాలి : రాష్ట్రానికి మంజూరైన 81 మంది ఐఎఫ్ఎస్ పోస్టుల్లో ప్రస్తుతం 55 మంది మాత్రమే ఉన్నారని, మిగతా 26 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఖాళీలు లేకుండా సరిపడే సంఖ్యలో ఐఎఫ్‌ఎస్‌లను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని నర్సరీల్లో సుమారు 22 కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించగా జూన్‌లో వర్షాకాలం ఆరంభంలో వీటిని నాటేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.