తెలంగాణ

telangana

ETV Bharat / state

వ‌స‌తిగృహాల్లో ఘ‌ట‌న‌లపై సీఎం సీరియస్ - బాధ్యులపై వేటు వేయాల‌ని ఆదేశాలు - CM REVANTH ANGRY HOSTEL INCIDENTS

పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలన్న సీఎం రేవంత్​ ఆదేశం - వసతి గృహాల్లో తరచూ ఘటనలు చోటుచేసుకోవడంపై సీఎం ఆగ్రహం

CM REVANTH REDDY
CM REVANTH REDDY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 10:53 AM IST

Updated : Nov 28, 2024, 12:28 PM IST

CM Revanth on Hostel Food Issues : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠ‌శాల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల్లలో ఉన్న విద్యార్థుల‌ను క‌న్న బిడ్డల్లా చూడాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యార్థులకు ప‌రిశుభ్రమైన వాతావ‌ర‌ణంలో పౌష్ఠికాహారం అందించ‌డంలో ఎటువంటి అలసత్వానికి తావు ఇవ్వరాదని ముఖ్యమంత్రి జిల్లా క‌లెక్టర్లకు తెలిపారు. విద్యార్థుల‌కు అందించే ఆహారానికి సంబంధించి చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌ల‌పై ముఖ్యమంత్రి ప‌లుమార్లు స‌మీక్షించారు.

క‌లెక్టర్లు త‌ర‌చూ పాఠశాలల‌, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల‌ల‌ను త‌నిఖీ చేయాల‌ని.. అనంత‌రం అందుకు సంబంధించిన నివేదిక‌ల‌ను సమ‌ర్పించాల‌ని సీఎం క‌లెక్టర్లను ఆదేశించారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్యవ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్యలు త‌ప్పవ‌ని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఎవ‌రైనా నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేందుకు వెనుకాడ‌మ‌ని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. ప‌లుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొర‌పాట్లు చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి ఆవేద‌న వ్యక్తం చేశారు.

విద్యార్థుల‌కు మంచి విద్య అందించాల‌నే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామ‌కాలు చేప‌ట్టడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి గుర్తు చేశారు. విద్యార్థుల విష‌యంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొంద‌రు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని మండిపడ్డారు. అటువంటి శ‌క్తుల విష‌యంలో క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తామ‌ని, బాధ్యులైన వారిని చ‌ట్టప్రకారం శిక్షిస్తామ‌ని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

వసతి గృహాల ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోలనలు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అసలేం జరిగింది : గత నెల 30వ తేదీన కుమురం భీం జిల్లా వాంకిడి పాఠశాల వసతి గృహంలో భోజనం వికటించి 21 రోజుల పాటు వెంటిలేటర్​పై చికిత్స పొందుతూ ఈనెల 25న విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాలపై సీఎం రేవంత్​ రెడ్డి సీరియస్​ అయ్యారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీఎం హెచ్చరించిన ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాగనూరు జడ్పీ పాఠశాల భోజన వికటించడం కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మాగనూరు జడ్పీ పాఠశాలకు ఏమైంది? - మరోసారి వికటించిన మధ్యాహ్న భోజనం - ఈసారి 40 మందికి పైగా అస్వస్థత

పిల్లలు చనిపోతే కానీ స్పందించరా ? - మాగనూర్ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం

Last Updated : Nov 28, 2024, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details