CM Revanth Nalgonda Tour : 2014 జూన్ 2కు ఎంత ప్రాధాన్యత ఉందో.. 2023 డిసెంబరు 7కు అంతే ప్రాధాన్యత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి అవసరం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిదని అన్నారు. నల్గొండ జిల్లాలోని మెడికల్ కాలేజీలో జరిగిన తొలి ఏడాది కాంగ్రెస్ పాలన- కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండ వ్యక్తేనని అన్నారు. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుందని పేర్కొన్నారు. నల్గొండలో కృష్ణాజలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని ప్రజలు భావించారని తెలిపారు. కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన చెందారు. ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండకు అధిక నష్టం జరిగిందన్నారు.
"నల్గొండకు కృష్ణా జలాలను తెచ్చి సస్యశ్యామలం చేస్తాం. వరి వేస్తే.. ఉరేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. మా హయాంలో వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇచ్చాం. మూడురోజుల్లోనే రైతులకు ధాన్యం అమ్మిన డబ్బులు చెల్లిస్తున్నాం. వ్యవసాయం అంటే దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డు సృష్టించింది. గతంలో ఎమ్మెల్యేలను లాక్కొన్నా.. వెనుకడుగు వేయకుండా పోరాడాం. ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా?. గెలిస్తే ఉప్పొంగిపోవడం.. ఓడితే కుంగిపోవడం కేసీఆర్ స్థాయికి తగదు. గతంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ప్రజల్లో ఉండి ఎంపీగా గెలిచాను." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
గాలి బ్యాచ్‌ను కేసీఆర్ ప్రజలపైకి వదిలారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా వద్దంటున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు వద్దంటే.. తెలంగాణ ఎలా ముందుకెళ్తుంది అని ప్రశ్నించారు. 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే అందులో నల్గొండ జిల్లాకు వేల ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. దేశ చరిత్రలో ఏడాది పాలనలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే దిల్లీలో క్షమాపణలు చెబుతానంటూ సవాల్ విసిరారు.