Chandrababu Naidu Tribute to NTR :రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.
సంక్షేమంతో పాటే అభివృద్ధి : సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు కొనియాడారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారని అన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని చంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పని చేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని చంద్రబాబు సూచించారు.