తెలంగాణ

telangana

ETV Bharat / state

డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌, బాలకృష్ణకు పద్మభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ - CENTRE ANNOUNCED PADMA AWARDS 2025

తెలంగాణ తరఫున డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ, ఏపీ నుంచి బాలకృష్ణకు పద్మభూషణ్ - తెలంగాణ నుంచి ఇద్దరికే ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి

Centre Announced Padma Awards 2025
Centre Announced Padma Awards 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2025, 9:12 PM IST

Updated : Jan 25, 2025, 10:32 PM IST

Centre Announced Padma Awards 2025 :రిపబ్లిక్‌ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రం నుంచి ప్రముఖ వైద్యులు, ఏఐజీ హాస్పిటల్ ఛైర్మన్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌ ప్రకటించింది. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగకు ప్రజావ్యవహారాలు విభాగంలో పద్మశ్రీ ప్రకటించింది. మరోవైపు కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్​ తరఫున పద్మభూషణ్ ప్రకటించారు.

పద్మ విభూషన్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డ్ తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. సమాజానికి, దేశానికి మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన 2002లో పద్మశీ, 2016లో పద్మభూషణ్ అందుకున్నారు.

పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. లెజండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో ట్వీట్ చేశారు. మరోవైపు ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు లోకేష్ కూడా బాలకృష్ణకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం వరించడం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె మందకృష్ణకు అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్​ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు : ఆంధ్రప్రదేశ్​కు నుంచి మిరియాల అప్పారావు, మాడుగుల నాగఫణి శర్మ, పంచముఖి రాఘవాచార్య, కె.ఎల్​ కృష్ణలకు పద్మశ్రీని ప్రకటించింది. ఈసారి కేంద్రం పద్మ పురస్కారాలకు 139 మందిని ఎంపిక చేసింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరికి మాత్రమే పద్మ అవార్డులు వరించాయి.

బాలకృష్ణకు అరుదైన గౌరవం- పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికైన నటసింహం

ప‌ద్మ పుర‌స్కారాల్లో వివ‌క్ష‌పై సీఎం అసంతృప్తి :ప‌ద్మ పుర‌స్కారాల్లో వివ‌క్ష‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల పేరుతో తెలంగాణ ప్ర‌జ‌లను కేంద్రం అవ‌మానించిందని మండిపడ్డారు. ఈ మేరకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాయాల‌ని నిర్ణయించారు. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్ (ప‌ద్మ‌విభూష‌ణ్‌), చుక్కా రామ‌య్య (ప‌ద్మ‌భూష‌ణ్‌), అందెశ్రీ (ప‌ద్మ‌భూష‌ణ్‌), గోర‌టి వెంక‌న్న (ప‌ద్మ‌శ్రీ‌), జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు (ప‌ద్మ‌శ్రీ‌) వంటి ప్ర‌ముఖుల‌ పేర్లను ప్రతిపాదించింది. అయితే వీరిలో ఎవరిని కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డం నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డ‌మేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 139 మందికి పుర‌స్కారాలు ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు క‌నీసం అయిదు పుర‌స్కారాలు ప్ర‌కటించ‌క‌పోవ‌డంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైద్యరంగంలో విశేష సేవలందించిన నాగేశ్వరరెడ్డి :పద్మవిభూషణ్​కు ఎంపికైనడాక్టర్నాగేశ్వరరెడ్డి కర్నూలులో ఎంబీబీఎస్‌ విద్యను పూర్తి చేసి, ఛండీగఢ్‌లో గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో పీజీ పూర్తిచేశారు. హైదరాబాద్‌లో ఏఐజీ ఆసుపత్రిని స్థాపించి ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రపంచ దేశాల్లో ఎండోస్కోపీ చికిత్సలపై వందలాది ఉపన్యాసాలిచ్చారు. 700కి పైగా వైద్యపత్రాలను కూడా సమర్పించి, 50కి పైగా వైద్యపత్రికలను రివ్యూ చేశారు. భారత ప్రభుత్వం డాక్టర్‌ నాగేశ్వర్​ రెడ్డిని 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. ఆయన వైద్య రంగంలో చేసిన సేవలకు పలు అవార్డులు వరించాయి. అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపీ వారు 2009వ సంవత్సరంలో నాగేశ్వరరెడ్డికి మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు ఎండోస్కోపీ విభాగంలో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా అభివర్ణిస్తున్నారు.

ఎస్సీవర్గీకరణ కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ :మందకృష్ణ మాదిగ వరంగల్ జిల్లాలోని హంటర్​రోడ్డు శాయంపేటలో 1965లో జన్మించారు. ఆయన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘ స్థాపకులు. ఆయన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకోసం పోరాడారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం మందకృష్ణ మాదిగను పద్మశ్రీ ప్రకటించింది.

భారత అథ్లెట్లకు పురస్కారాలు- శ్రీజేశ్​కు పద్మ భూషణ్, అశ్విన్​కు పద్మ శ్రీ

Last Updated : Jan 25, 2025, 10:32 PM IST

ABOUT THE AUTHOR

...view details