Central And State Government Jobs With Inter Qualification :ప్రభుత్వం ఉద్యోగమే లక్ష్యమైతే ఇంటర్మీడియట్ విద్యార్హతతోనూ సాధించవచ్చు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో ఉద్యోగాలు ఈ విద్యార్హతతో ఉన్నాయి. వీటిలో ఏటా తప్పనిసరిగా వెలువడుతున్న ప్రకటనలే అధికం. అందువల్ల ఇవి లక్ష్యంగా చేసుకుంటే తక్కువ ప్రయత్నాల్లోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు.
సర్కార్ కొలువు సాధించాలి అనుకుంటే ముందే స్పష్టమైన లక్ష్యం ఏర్పరచుకోవాలి. ఇంటర్ చదువుతున్నప్పుడే ఈ వివరాలన్నీ తెలుసుకుని, సన్నద్ధత ప్రారంభిస్తే తక్కువ వ్యవధిలోనే ఉద్యోగం సాధించవచ్చు. చిన్న వయసులోనే కొలువులు పొందినవారు అనుభవం, ప్రతిభతో త్వరగా ఉన్నత హోదాకు చేరుకునే అవకాశాలు ఉంటాయి.
ఇంటర్/ ప్లస్ 2 పూర్తి చేసిన విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు రక్షణ రంగంలోనే ఉన్నాయి. అదే ఎంపీసీ విద్యార్థులకైతే ఎన్నో అవకాశాలు. పోస్టును బట్టి శిక్షణ అనంతరం నెలకు రూ.50 వేల నుంచి లక్షలు పైగా వేతనం అందించే కొలువులు కేంద్ర దశాల్లో ఉంటాయి. కేంద్రం, రాష్ట్రంలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాలు పొందేవారు సుమారు రూ.35వేలు అంత కంటే ఎక్కువ జీతం పొందవచ్చు.
ప్రస్తుతం ఈ నియామకాలన్నీ అగ్నివీర్ స్కీం కింద చేపడుతున్నారు. ఎంపికైనవారు సైన్యంలో వారి నాలుగేళ్లు సేవలు అందించాలి. ఆ తర్వాత వాళ్ల సేవలు బట్టి ఉద్యోగాన్ని శాశ్వతం చేస్తారు. ఎయిర్ మెన్ విభాగంలో గ్రూప్ ఎక్స్, వై ట్రేడుల్లో పలు పోస్టులు ఇంటర్ విద్యార్హతతో పొందవచ్చు.
గ్రూప్ ఎక్స్:ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ తప్ప మిగిలిన అన్ని కొలువులకు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 50 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌లో 50 శాతం మార్కులు ఉండాలి.
గ్రూప్ వై: మ్యుజీషియన్, మెడికల్ అసిస్టెంట్ కాకుండా మిగిలిన వాటికి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌లో 50 శాతం మార్కులు సాధించాలి. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టులకు బైపీసీతో ఇంటర్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
అన్ని పోస్టులకూ విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. అన్ని పోస్టులకూ నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు ఉంటేనే ఉద్యోగంలోకి తీసుకుంటారు. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు వాళ్లు అర్హులు.
ఈ నోటిఫికేషన్లు ఏడాదికి రెండు సార్లు వస్తాయి. పరీక్షలో ప్రతిభ, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. గ్రూప్ ఎక్స్ విభాగంలో ఎంపికైనవారికి ఫిట్టర్, గ్రూప్ వై విభాగంలో చేరినవారికి టెక్నీషియన్ ట్రేడులో ఉద్యోగం కేటాయిస్తారు. నాన్ టెక్నికల్ ట్రేడుల్లో అకౌంట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్, ఎయిర్ ఫోర్స్ పోలీస్ తదితర ఉద్యోగాలు ఉంటాయి. శాశ్వత ఉద్యోగంలో అవకాశం వచ్చిన వారికి గ్రూప్ ఎక్స్ ట్రెడుల్లో రూ.33,100, గ్రూప్-వై ట్రేడులకు రూ.26,900 మూలవేతనం ఇస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా ఇస్తారు. వీరు కెరియర్లో ఎయిర్ క్రాఫ్ట్‌మెన్ నుంచి మాస్టర్ వారంట్ ఆఫీసర్ వరకు పదోన్నతి లభిస్తుంది. ప్రతిభావంతులు ఆఫీసర్ హోదా అందుకునే అవకాశం కూడా ఉంటుంది.
నేవీలో :ఆర్టిఫీషర్ అప్రెంటిస్, సీనియర్ సెకెండరీ రిక్రూట్ పోస్టులకు ఎంపీసీతో ఇంటర్ అర్హత ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టుల ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు ఇస్తారు. శాశ్వత కొలువుకు ఎంపికైనవారికి రూ.21,700 మూల వేతనం లభిస్తుంది. దీనికి మిలటరీ సర్వీస్ పే రూ.5200 అదనంగా వస్తుంది. ఏఏకు ఎంపికైనవారు రూ.6200 గ్రూప్ ఎక్స్ పే కింద అదనంగా ఇస్తారు. వీటన్నింటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏలు కూడా వస్తాయి. వీరు మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ హోదా వరకు పదోన్నతి లభిస్తోంది.
ఆర్మీలో :స్టోర్ కీపర్, సోల్జర్ క్లర్క్, పోస్టులకు మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్ టెక్:ఎంపీసీ గ్రూపులో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్: బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు రావాలి.అన్ని పోస్టులకూ వయసు 17 నుంచి 23 ఏళ్లలోపు వాళ్లు మాత్రమే అర్హులు.
ప్రకటనలు:ఈ నోటిఫికేషన్ ఏడాదికి రెండుసార్లు వస్తుంది. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. శాశ్వత ఉద్యోగిగా అవకాశం వచ్చినవారికి రూ.21,700 మూల వేతనంతో పాటు రూ.5200 మిలటరీ సర్వీస్ పే ఇస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తోంది.
కోస్టు గార్డు : నేవిక్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ గ్రూపు చదివుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా 50 శాతం మార్కులు ఉండాలి. 18 - 22 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ కనబర్చినవారికి పీఈటీ, మెడికల్ టెస్టులు నిర్వహించి నియామకాలు చేపడతారు. ఈ ప్రకటనలు ఏటా రెండుసార్లు వస్తాయి. వీరికి రూ.21,700 మూలవేతనం ఇస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అదనంగా లభిస్తాయి. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకు పదోన్నతి వస్తుంది.
సీహెచ్‌ఎస్‌ఎల్:కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్‌ఎస్‌ఎల్) పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ (జేఎస్‌ఎ), లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ), పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ, స్కిల్ టెస్టులు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇంటర్ అన్ని గ్రూపులవారూ ఈ పోస్టులకు అర్హులు.
స్టెనోగ్రాఫర్:కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ ఏడాది/రెండేళ్లకు ఒకసారి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనో స్కిల్ టెస్టు పెడతారు. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్‌గా విధులు కేటాయిస్తారు. వయసు పోస్టును బట్టి 18 నుంచి 27/30 ఏళ్లలోపు మాత్రమే పరీక్షకు అర్హులు.
ఇంటర్ అర్హతతో రైల్వేలో జాబ్స్ - మొదటి నెల నుంచే రూ.40 వేల శాలరీ - చివరి తేదీ ఎప్పుడంటే?
నాన్ టెక్నికల్ పాపులర్ కేడర్(ఎన్‌టీపీసీ)లో ఇంటర్ విద్యార్హతతో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటిలో కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ కొలువులకు లెవెల్-3 జీతం లభిస్తుంది. రూ.21,700 మూలవేతనం ఇస్తారు. అన్నీ కలిపి సుమారు రూ.40వేలు వరకు వేతనం వస్తుంది. మిగిలినవి లెవెల్-2 కొలువులు. వీటికి రూ.19,900 మూలవేతనం లభిస్తుంది. అన్నీ కలిపి సుమారు రూ.36 వేలు మొదటి నెల నుంచే అందుతుంది. ఎంపికకు రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ)లో ప్రావీణ్యం తప్పనిసరిగా పొందాలి. టైపిస్ట్ (అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్) పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు(టీఎస్‌టీ) అదనంగా నిర్వహిస్తారు. 18 నుంచి 33 ఏళ్లలోపువారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
కానిస్టేబుల్, జైలు వార్డర్, ఫైర్‌మెన్ : ఇంటర్ అన్ని గ్రూపుల వారు అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. వయసు 18 నుంచి 24ఏళ్ల లోపు వారు అర్హులు. ఫైర్ మెన్, జైలు వార్డర్ పోస్టులకు 32ఏళ్ల వయసు వారికి అవకాశం ఉంటుంది. ఎక్సైజ్ డిపార్టుమెంట్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ విద్యార్థులు పోటీ చేసే అవకాశం ఉంటుంది.
ఫారెస్ట్ సబ్ సర్వీస్‌లో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 30 వయస్కులు అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా చూస్తారు. పరీక్షలో ప్రతిభ, నడకతో ప్రతిభ చూపిన వారితో పోస్టులు భర్తీ చేస్తారు. ఇంటర్ అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉంటుంది.
కోర్సుతో పాటు అత్యున్నత కొలువు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఎ) పరీక్షను మహిళలతో పాటు ఇంటర్ అన్ని గ్రూపులవారికి అర్హత ఉంటుంది. ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను ఉచితంగా చదువుకుంటారు . శిక్షణ అనంతరం వీరిని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో లెవెల్ 10 హోదాతో విధుల్లో నిర్వస్తారు. అలాగే ఆర్మీ 10+2 టెక్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పోస్టులకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐఐటీ-జేఈఈ మెయిన్స్ స్కోరు, ఇంటర్వ్యూలతో ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. వీరికి నిర్దేశిత బ్రాంచీల్లో బీటెక్ కోర్సు ఉచితంగా అందిస్తారు. శిక్షణ అనంతరం లెవెల్ 10 హోదాతో విధులు కేటాయిస్తారు.
ఇంటర్‌తో రూ.18 లక్షల జీతం - ఆర్మీలో ఉద్యోగాలు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
కనీస అర్హత ఉన్నా విదేశాల్లో మీకు లక్షల జీతంతో జాబ్ గ్యారెంటీ - ఎలాగో తెలుసుకోండి