CAG Report on Telangana :గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం అమలులో మోసాలు జరిగినట్లు కాగ్ అనుమానం వ్యక్తం చేసింది. ఏడు జిల్లాల్లో మచ్చుకు తనిఖీ చేయగా రూ.253.93 కోట్ల మేర సందేహాస్పద లావాదేవీలతో పాటు తీవ్ర లోపాలను గమనించినట్లు పేర్కొంది. నకిలీ రవాణా ఇన్‌వాయిస్‌లు, నకిలీ వాహనాలు, వాహనాల్లో సామర్థ్యానికి మించి గొర్రెల యూనిట్ల రవాణా, గొర్రెలకు నకిలీ ట్యాగ్‌ల కేటాయింపు, తదితరాలు ఉన్నట్లు కాగ్ పేర్కొంది.
CAG on Sheep Distribution Telangana :సంగారెడ్డి జిల్లాలో ఒక మోటార్ బైక్‌పై 126 గొర్రెలు రవాణా చేసినట్లు, నల్గొండ జిల్లాలో ఒక ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్లు కాగ్ తనిఖీల్లో తేలింది. అంబులెన్స్‌లలోనూ, అగ్నిమాపక వాహనాల్లోనూ, నీళ్ల ట్యాంకర్లలో, మొబైల్ కంప్రెసర్‌లలో గొర్రెలు రవాణా చేసినట్లు చూపారని పేర్కొంది. ఒకే వాహనం ఒకే రోజు శ్రీకాకుళం, కడప జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు గొర్రెలు తరలించినట్లు చూపారని కాగ్ ఆడిట్‌లో తెలిపింది.
ఆదాయం పెరిగినా రెవెన్యూ మిగులు సాధించడంలో రాష్ట్రం విఫలం - కాగ్ రిపోర్టు
2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో ఐదు జిల్లాల్లో 96,299 గొర్రెల యూనిట్లు (Sheep Distribution)పంపిణీ చేసినట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారని కాగ్ వివరించింది. అయితే దాణా మాత్రం కేవలం 29,616 యూనిట్లకు మాత్రమే సరఫరా చేసినట్లు తేలిందని పేర్కొంది. దాదాపు 70శాతం యూనిట్లు దాణా తీసుకోలేదంటే గొర్రెల సరఫరాలో పలు మోసాలు జరిగినట్లు అనుమానించాల్సి వస్తుందని కాగ్ అభిప్రాయపడింది.
Sheep Distribution Scam in Telangana : గొర్రెను గుర్తుపట్టేలా వేసే ట్యాగులు కూడా మోసాలు జరిగినట్లు నిర్ధారిస్తున్నాయని కాగ్ తెలిపింది. మొత్తం 80.37 లక్షల ట్యాగ్ సంఖ్యల్లో రెండు లక్షలకు పైగా ట్యాగ్ సంఖ్యలు రెండు నుంచి 34 సార్లు పునరావృతం అయినట్లు పేర్కొంది. ఐదు శాతానికి పైగా గొర్రెల చెవులకు కోతలు, చిల్లులు ఉన్నాయంటే సరఫరా చేసిన గొర్రెలనే మళ్లీ చేసినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది.
మరోవైపు బీమా పథకం కింద క్లెయిమ్‌లు పొందిన 860 మంది రైతుల పేర్లు గొర్రెల పథకం లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు తేలిందని వివరించింది. అయితే వారి వివరాలు వెబ్‌సైట్‌లో కూడా లేకపోవడంతో యూనిట్లు ఇచ్చే సమయానికి వారు వాస్తవంగా జీవించి ఉన్నారా లేరా అనే విషయాన్ని నిర్ధారించలేకపోయినట్లు తెలిపింది. లబ్ధిదారులు మరణించిన 14 నుంచి 36 నెలలు గడిచిన తర్వాతే వారి పేరుతో మంజూరు ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంది. లబ్ధిదారుల వారీగా దస్త్రాలు నిర్వహించని కారణంగా వారి లావాదేవీలను నిర్ధారించలేకపోయిందని, దీంతో నిధుల దుర్వినియోగమైతే గుర్తించలేని ప్రమాదముందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.