CAG Report On Barrages Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరంపై ఆడిట్ నివేదిక ఇచ్చిన కాగ్ అందులో ఇతర బ్యారేజీల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ క్రమంలోనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల దిగువ భాగంలో కొంత మేర 2019 నవంబర్‌లోనే దెబ్బతిన్నట్లు తెలిపింది.
2019 నవంబర్‌లో వరద భారీగా రావడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారని వెల్లడించింది. గేట్లు మూసిన తర్వాత ఆనకట్టల దిగువ భాగంలో ఆర్‌సీసీ వేసిన కోట్, సీసీ కర్టెన్ గోడల్లో కొంత భాగం, దిగువ భాగంలో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయని పేర్కొంది. ఫలితంగా 180.39 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక (CAG Report On Kaleshwaram Barrages) వివరించింది.
Annaram Sundilla Barrages Damage :మేడిగడ్డ వద్ద 83.83కోట్లు, అన్నారం వద్ద 65.32కోట్లు, సుందిళ్ల వద్ద రూ.31.24కోట్లు నష్టం జరిగినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. విడుదలైన నీటి అధిక వేగం, శక్తిని వెదజల్లే పనులకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ నష్టానికి కారణమని నీటిపారుదలశాఖ అధ్యాయనాలు వెల్లడించినట్లు తెలిపింది. ఈ అనుభవంతో మూడు బ్యారేజీల్లో నష్టాలను సరిదిద్దేందుకు రూ.476.03 కోట్లతో నీటి పారుదల శాఖ అంచనాలు రూపొందించిందని వెల్లడించింది. ఇందులో మేడిగడ్డకు రూ.212.03 కోట్లు అన్నారం బ్యారేజీకి రూ.139.50 కోట్లు, సుందిళ్లకు 124.50 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు వివరించింది.
కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా - ప్రయోజనాల్లో మాత్రం అదనపు పెరుగుదల లేదు : కాగ్ నివేదిక