Rahul Gandhi Parliament Attack : పార్లమెంటు ప్రాంగణంలో తోపులాట నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీ నెట్టేయడం వల్లే తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్‌పై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే హత్యాయత్నం బీఎన్ఎస్ సెక్షన్ 109 మినహా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
#UPDATE | BJP MPs injured case: Delhi Police has filed an FIR against Congress leader Rahul Gandhi on BJP's complaint. Police have only removed section 109 (attempt to murder) of BNS. All other sections are the same as given in the complaint: Delhi Police
— ANI (@ANI) December 19, 2024
BJP had filed a… https://t.co/OL8ofV9X1Z
ఖండించిన కాంగ్రెస్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంతకుముందే విమర్శించారు. "అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై కూడా వారు చర్చ జరపాలనుకోవడం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చిత్త శుద్ధిని దురుద్దేశపూర్వకంగా కించపరిచే యత్నమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అధికార, విపక్ష ఎంపీల మధ్య తోపులాట జరుగుతుంటే, భద్రతాసిబ్బంది జోక్యం చేసుకోకపోవడం చిత్రంగా ఉందని, ఎటువంటి పక్షపాతం లేకుండా స్పీకర్ ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.