TTD Invites proposals For Tirumala Vision 2047 : స్వర్ణాంధ్ర విజన్-2047 మాదిరిగా ‘తిరుమల విజన్-2047’ కోసం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. తిరుమల దేవస్థానంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే విధంగా వ్యూహాత్మక ప్రణాళికతో ‘తిరుమల విజన్-2047’ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీల నుంచి ప్రతిపాదనల కోసం ఆర్ఎఫ్‌పీని తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆసక్తి ఉన్న ఏజెన్సీలు మూడు వారాల్లోగా ప్రతిపాదనలు పంపించాలని టీటీడీ సూచించింది. ఇలాంటి భారీ స్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఏజెన్సీలకు అనుభవం తప్పనిసరి అని టీటీడీ పేర్కొంది.
తిరుమల విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలివే :
- ఆధునిక పట్టణ ప్రణాళికల నియమావళిని అనుసరిస్తూ తిరుమల పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వత వ్యూహాలను అమలు చేయడం.
- ఉత్తమ ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణ, వారసత్వ పరిరక్షణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం.
- ప్రపంచవ్యాప్తంగా తిరుమలను ఆదర్శంగా(రోల్ మోడల్‌గా) తీర్చిదిద్దేందుకు చర్యలు.
- తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయడం.
- ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలోనుంచుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం.
- తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వ్యూహాలు రూపొందించడం.
- ప్రతి అంశంపై వివరణాత్మక నివేదికలు(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లు సిద్ధం చేయడం.