Air Force Airmen Recruitment 2025 : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌మెన్ గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ర్యాలీ కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్లో బీఎస్సీ, డిప్లొమా వీటిలో ఏదైనా విద్యార్హత ఉంటే పోటీ పడొచ్చు. ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. సెలక్ట్ అయిన అభ్యర్థులు శిక్షణ తర్వాత ఎయిర్ మెన్‌గా తొలి నెల నుంచే రూ.50 వేలకు పైగా జీతం అందుకోవచ్చు.
ర్యాలీ వివరాలు : ఈనెల జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు కేరళలోని కొచ్చి ఎర్నాకుళం షెనాయ్స్ పీటీ ఉషా రోడ్, మహారాజా కాలేజ్ గ్రౌండ్లో గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియామకాల్లో ర్యాలీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులే అర్హులు. ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఇందులో పాల్గొనవచ్చు. కానీ ఫిబ్రవరి ఒకటో తేదీనే రిపోర్ట్ చేయాలి.
డీ ఫార్మసీ, బీ ఫార్మసీ వాళ్లైతే ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి 4న రిపోర్ట్ చేయాలి. ఆ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు వివరాలు అందించాలి. కావాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్, వాటి జిరాక్స్‌లు, ఫొటోలు, పరీక్షకు కావాల్సిన వాటితో వెళ్లాలి.
ఎంపిక ప్రక్రియ : ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు: ఫిజికల్ ఫిట్‌నెస్‌లో భాగంగా 1.6 కిలో మీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో చేరుకోవాలి. 21 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారైతే 7 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. అలాగే నిర్ణీత వ్యవధిలో 10 సిట్‌అప్స్, 10 పుష్‌అప్స్, 20 స్క్వాట్స్ పూర్తిచేయాలి.
రాత పరీక్ష : ఈ రాత పరీక్షను ఫిజికల్ ఫిట్‌నెస్‌లో ఉత్తీర్ణులైన వారికే అదే రోజు నిర్వహించనున్నారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్(మల్టిపుల్ ఛాయిస్డ్ క్వశ్చన్స్) తరహాలో వస్తాయి. ఇంగ్లిష్ పరీక్ష తప్ప మిగతా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. సమాధానాలు ఓఎంఆర్ షీట్‌పై గుర్తించాలి. పరీక్ష కాలం 45 నిమిషాలు ఉంటుంది.
- ఇంగ్లిష్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ వంటి సబ్జెక్టుల్లో ప్రశ్నలుంటాయి.
- ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకూ పావు(1/4) మార్కు చొప్పున తీసేస్తారు.
- ఇంగ్లిష్ సబ్జెక్టు ప్రశ్నలు సీబీఎస్‌ఈ 10+2 సిలబస్ నుంచే వస్తాయి.
- ఇంగ్లిష్ 20, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఈ రెండు విభాగాల్లోనూ తప్పని సరిగా మినిమమ్ మార్కులు రావాలి.
- https://airmenselection.cdac.in వెబ్‌సైట్‌లో సిలబస్, మాదిరి ప్రశ్నలు చూసుకోవచ్చు.
అడాప్టబిలిటీ టెస్టు: రాత పరీక్షలో అర్హత సాధించినవారికి అడాప్టబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు. ఎయిర్ ఫోర్స్ వాతావరణానికీ, ఆ ఉద్యోగానికీ అభ్యర్థి సూట్ అవుతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే మెడికల్ పరీక్షలు నిర్వహించి ట్రైనింగ్ కోసం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి వివరాలు మే 30 2025న ప్రకటిస్తారు.
ట్రైనింగ్ : ర్యాలీలో ఉత్తీర్ణత సాధించినవారికి వాయుసేన ప్రాథమిక శిక్షణ కేంద్రంలో తర్ఫీదు నిర్వహిస్తారు. అనంతరం అభ్యర్థులను సంబంధిత ట్రేడ్ ట్రైనింగ్ సెంటర్లకు పంపుతారు. శిక్షణ సమయంలో రూ.14,600 భృతిని చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అనంతరం డ్యూటీలోకి తీసుకుంటారు. వీరు 20 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని తమకు నచ్చిన వారు 57 ఏళ్ల వయసు నిండే వరకూ పొడిగించుకోవచ్చు.
మొదటి నెల నుంచే మిలటరీ సర్వీస్ పే తో కలిపి రూ.26,900 జీతం అందుతుంది. అన్ని రకాల అలవెన్సులూ కలిపి సుమారు రూ.50 వేల వేతనం ఖాతాలో జమ అవుతుంది. మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌లో చేరినవారు ఫస్ట్ ఎయిడ్ చేయగలిగేలా దానిపై అవగాహన పెంచుకుంటారు. మెడికల్ స్టోర్లు, డిస్పెన్సరీ, వార్డు పర్యవేక్షణ వీరి డ్యూటీలో భాగం. విధుల్లో చేరాకా అనుభవాన్ని బట్టి భవిష్యత్తులో ప్రమోషన్ల ద్వారా ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు. సర్వీసులో కొనసాగుతూ కొన్ని డిపార్ట్మెంటల్ పరీక్షల్లో అర్హతలు సాధించినవారు కమిషన్డ్ ఆఫీసర్లూ కావచ్చు. రిటైర్డ్ తర్వాత పింఛను, ఇతర సౌకర్యాలను పొందుతారు.
విద్యార్హత : ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. విడిగా ఇంగ్లిషు సబ్జెక్టులో 50 శాతం మార్కులు రావాలి. ఇవే సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఒకేషనల్ కోర్సు పూర్తిచేసినవారు కూడా అర్హులే. లేదా డీఫార్మసీ/బీఫార్మసీ కోర్సులో 50 శాతం మార్కులు పొంది ఉండాలి.
వయసు : ఇంటర్ అర్హతతో అయితే జులై 3, 2004 - జులై 3, 2008 మధ్య జన్మించినవారే అర్హులు. ఫార్మసీ చేసినవారైతే జులై 3, 2001 - జులై 3, 2006 మధ్య జన్మించాలి.
ఎత్తు: కనీసం 152 సెంటి మీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెంటి మీటర్లు. కంటికి దృష్టిదోషం ఉండరాదు. చెవుల వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి.
పూర్తి నోటిఫికేషన్ కోసం వెబ్‌సైట్‌లో చూడండి: https://airmenselection.cdac.in/CASB/
ఇంటర్, డిగ్రీ అర్హతలతో - వాయుసేనలో ఉన్నత కొలువులు - AFCAT 2024