తెలంగాణ

telangana

ETV Bharat / state

గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం - స్థానికుల్లో టెన్షన్ టెన్షన్ - BUILDING TILTS IN GACHIBOWLI

గచ్చిబౌలి సిద్దిఖీ​నగర్​లో పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం - భయంభయంగా గడుపుతున్న స్థానికులు - పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు

Building Tilts in Gachibowli
Building Tilts in Gachibowli (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 10:58 PM IST

Updated : Nov 20, 2024, 7:20 AM IST

Building Tilts in Gachibowli : హైదరాబాద్​ గచ్చిబౌలి ప్రాంతంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సిద్దిఖీనగర్‌లో ఓ ఐదంతస్థుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకు ఒరిగింది. భవనంలో నివసించే వారు శబ్ధాలతో భవనం ఒరుగుతుండడం గమనించి బయటకు పరుగులు తీశారు. భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో నివసించే వారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల నివసించే వారందరినీ ఇళ్లు ఖాళీ చేయించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

50 గజాల్లో ఐదంతస్తుల భవనం, అందులో దాదాపు 50 మంది నివాసం, ఒక్కసారిగా భవనం పెద్ద శబ్ధాలతో పక్కకు ఒరిగింది. ఏం జరుగుతుందో అర్థంకాని భవనంలో నివసించే వారు తేరుకుని బయటకు పరుగులు తీశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. గచ్చిబౌలిలోని సిద్దిఖీనగర్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చుట్టూ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, వాటి వెనక సిద్దిఖీనగర్‌ బస్తీ, స్థానికంగా వంద గజాల్లోపు స్థలంలోనే భారీ నిర్మాణాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే 50 గజాల్లో నిర్మించిన ఐదంతస్థుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.

భవనం పక్కనే మరో భవనం నిర్మాణానికి యజమాని పునాది వేయడానికి భారీ గుంతలు తవ్వాడు. దీంతో గత మూడు రోజులుగా పక్కనే ఉన్న భవనంలో ఉంటున్న వారికి ప్రతి రోజు శబ్ధాలు వినిపిస్తుండడం గమనించారు. ఈ విషయాన్ని వారు తమ భవన యజమానికి కూడా తెలిపారు. ఆయన నిర్మాణం కోసం గుంతలు తవ్వుతున్న పక్క స్థలం యజమాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాడు. అయినప్పటికీ అతను పట్టించుకోకుండా పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగించాడు. ఫలితంగా మంగళవారం రాత్రి ఐదంతస్థుల భవనం పక్కకు ఒరిగిపోయింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, స్థానికులు భయాందోళనలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

పునాది కోసం తవ్విన గుంత.. పక్కనే ఒరిగిన భవనం (ETV Bharat)

సమాచారం అందుకున్న జీహెచ్‌ఎంసీ, పోలీసులు, డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదకరంగా మారిన భవనాన్ని కూల్చివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలను తీసుకు రానున్నారు. అయితే స్థానికులు ఆందోళనకర పరిస్థితుల మధ్య ఉంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒరిగిన భవనంలో ఉండే వారంతా కట్టుబట్టలతో బయటపడ్డారు. తమ సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులన్నీ భవనంలో ఉండిపోయాయని, కూల్చివేస్తే తమ పరిస్థితి ఏమిటని విచారం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిఖీనగర్‌లో సామర్థ్యానికి మించి అనేక భవనాలు నిర్మించినట్టు గుర్తించిన అధికారులు, దీనిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని తెలిపారు. భవనం ఒరగడానికి కారణమైన పక్క స్థలం యజమానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Last Updated : Nov 20, 2024, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details