CMR Engineering College Incident Update : మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కళాశాలలో విద్యార్థినిల ఆందోళనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ క్యాంపస్‌లోని వసతి గృహంలో స్నానాల గదిలో విద్యార్థినుల వీడియోలు చిత్రీకరించారన్న ఆరోపణలపై ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడియోలు తీయడంపై విద్యార్థినులు కళాశాలలో ఆందోళన చేపట్టగా, వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని సైబరాబాద్ సీపీకి ఆదేశాలు జారీ చేసింది.
రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినా రక్షణ లేదు : స్నానాల గదిలో తమ వీడియోలు తీశారంటూ మేడ్చల్ సీఎంఆర్ ఐటీ క్యాంపస్ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. కళాశాలలో బైఠాయించి ధర్నా చేశారు. వీరికి వివిధ విద్యార్థి సంఘాలు మద్ధతు తెలిపాయి. గురువారం ఉదయం నుంచే వసతి గృహం బయట విద్యార్థినిలు నిరసనకు దిగారు. విద్యార్థి సంఘాలు వస్తున్నట్లు సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం గేట్లు మూసేసి తాళాలు వేసింది. ఏబీవీపీ కార్యకర్తలు గేటు పైకెక్కి లోనికి దూకారు. ఆ తర్వాత గేటు తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి ధర్నాలో పాల్గొన్నారు. వీడియో చిత్రీకరణకు సంబంధించిన ఆధారాలను దొరకకుండా కాల్చేయడంతో పాటు యాజమాన్యం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంఆర్ కళాశాల ఛైర్మన్ గోపాల్‌రెడ్డి సముదాయించే ప్రయత్నం చేసినా, విద్యార్థినిలు వెనక్కి తగ్గలేదు. ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు తమ పిల్లల్ని ఇళ్లకు తీసుకెళ్లారు. ముందు రోజు రాత్రి ఆందోళన చేస్తున్నారన్న విషయం తెలియగానే విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసినట్టు కళాశాల యాజమాన్యం చెప్పుకొచ్చింది. విద్యార్థినిల డిమాండ్ మేరకు వార్డెన్‌ను విధుల నుంచి తొలగించామని, కళాశాల తరపున విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. బాధ్యులెవరున్నా కఠిన చర్యలుంటాయని చెప్పారు.
బాత్రూం వెంటిలెటర్ దగ్గర వేలిముద్రలు : విద్యార్థినిలను వీడియోలు తీశారన్న ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్ వార్డెన్ ప్రీతి, మెస్ ఇన్‌ఛార్జ్ సెల్వంను విచారించారు. విద్యార్థినుల అనుమానాల నేపథ్యంలో మొత్తం 12 ఫోన్లు స్వాధీనం చేసుకుని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించగా బాత్రూం వెంటిలెటర్ దగ్గర వేలిముద్రలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఫింగర్ ప్రింట్ బ్యూరోను పిలిపించి, ఆనవాళ్లు సేకరించారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వేలిముద్రలతో వీటిని పోల్చనున్నారు. ఘటన వెనక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తోందని, విద్యార్థినుల స్నానాల గదుల వెనుక నిర్మించిన రెండు గదుల్లో ఉండే పనివాళ్లు బాత్రూం వెంటిలెటర్ దగ్గరికి వెళ్లడానికి అవకాశమున్నట్లు గుర్తించినట్టు ఏసీపీ చెప్పారు. అయితే వీడియోలు తీసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
చర్యలు తీసుకుంటాం : విద్యార్థినుల ఆందోళన నేపథ్యంలో ఘటనను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజా రమణ సీఎంఆర్ వసతి గృహానికి వచ్చి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. కళాశాల యాజమాన్యానికి నోటీసు జారీ చేసింది. కమిషన్ ఛైర్మన్‌కు నివేదిక ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
"ఘటన వెనక కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కనిపస్తోంది. అమ్మాయిల బాత్రూం వెంటిలెటర్ దగ్గరికి పని వాళ్లు వెళ్లడానికి అవకాశం ఉంది. వీడియోలు తీసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు."- శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ ఏసీపీ
'బాత్రూం పక్కనే పనివాళ్ల గదులు - అదే అనుమానం కలిగిస్తోంది' - సీఎంఆర్ ఘటనపై ఏసీపీ