Relief for Medical Students : తెలంగాణ రాష్ట్ర ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు బిగ్ రిలీఫ్‌ను కల్పించింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నతమైన వైద్యవిద్య కోసం వెళ్లి చదువునభ్యసించిన తెలంగాణ విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 140ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
స్థానికతపై అసలు వివాదమెందుకంటే? :ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అప్లై చేసుకునే విద్యార్థులలో ఇంటర్ చదువుకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణ రాష్ట్రంలో చదివిన వారినే స్థానికులుగా పరిగణించేలా ప్రభుత్వం జీవో నెంబర్ 33ను జారీ చేసింది. దీనిపై కొందరు బాధితులు అప్పుడే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం స్థానికతకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ను కొత్తగా రూపొందించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సుప్రీం కోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం : హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించింది. కోర్టులో పిటిషన్ వేసిన 135 మంది వైద్య విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోవాలంది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం న్యాయశాఖ సమీక్ష చేసింది. న్యాయస్థానం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులను కౌన్సెలింగ్‌కు అనుమతించింది. కోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థుల మెరిట్ జాబితాను ప్రత్యేకంగా మరోసారి విడుదల చేసింది.