Bhadradri Cricketer Trisha Poojitha WPL 2024 :అమ్మాయిలంటే వంటింటి కుందేళ్లు కాదని ఎలాగైనా మంచి పేరు, ప్రతిష్ఠలు సాధించాలని చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యంతో పెరిగిందామ్మాయి. అందుకు క్రికెట్‌నే మార్గంగా ఎంచుకుంది. సహజంగా ఈ క్రీడలో మహిళలకు కుటుంబాల నుంచి ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ఆటలో తాను ఒక దిక్సూచిగా నిలవాలని నిర్ణయించుకొని ప్రయాణాన్ని మొదలు పెట్టింది ఈ యువ క్రీడాకారిణి. ప్రాక్టీస్ చేస్తోన్న అమ్మాయి పేరు త్రిషా పూజిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్వస్థలం. సోదరుడి స్ఫూర్తితో క్రికెట్‌పై ఇష్టం పెంచుకుంది.
Cricketer Trisha Poojitha in WPL: మిథాలీ రాజ్ స్థాయికి ఎదగాలని కలలు కంది. ప్రతిభను నమ్ముకుంటూ, అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తోంది. 12 ఏళ్లకే హైదరాబాద్ జట్టుకు ఎంపికైన ఈ భద్రాచలం అమ్మాయి మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తన స్వప్నం సాకారం చేసుకునేందుకు ఎంతో శ్రమించింది త్రిష. హైదరాబాద్ మహిళల టీమ్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగింది. భవిష్యత్‌లో జాతీయ సీనియర్ జట్టుకు ఆడాలన్న పట్టుదలతో ముందుకెళ్తోంది. త్వరలో మొదలు కాబోతున్న డబ్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కి ఎంపికైన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ అక్కడ సత్తా చాటి మరింత వెలుగులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
WPL 2023 : రెండేళ్ల పాపను వదిలి.. సమరానికి సై అంటున్న తెలుగు క్రికెటర్
Gujarat Giants Cricketer Trisha Poojitha : ఎనిమిదేళ్లకే కెరీర్ మొదలు పెట్టిన త్రిష అప్పటి నుంచి అండర్-16, 19, 23 విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. హైదరాబాద్ అండర్-23 మహిళల జట్టుకు కెప్టెన్‌గా సారథ్యం వహిస్తోంది. రోజుకు 7, 8 గంటలు ప్రాక్టీస్‌లో నిమగ్నమవుతోంది. ప్రస్తుత పోటీ వాతావారణాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా శిక్షణ తీసుకుంటోంది. 12 ఏళ్ల వయసులోనే రాష్ట్ర అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది త్రిష. చిన్న వయసులోనే బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది. అయిదేళ్లలో వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తోందీ యువతి. క్రికెట్‌లో త్రిష ఈ స్థాయికి ఎదగడానికి కుటుంబం ఎంతగానో ప్రోత్సాహన్నిచింది.