Best Weight Loss, Weight gain Tips :నేటి ఆధునిక జీవితంలో చాలా మంది ఫిట్‌గా ఉండటానికి ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. మరికొందరు జిమ్‌కు వెళ్తుంటారు. బరువు తగ్గాలనుకునేవారు కొందరైతే, పెరగాలని అనుకునే వారు మరికొందరు. సాధారణ బరువు ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఇరుగు పొరుగు వారు చేస్తున్నారని వారిని అనుసరిస్తుంటారు. ఫోన్లలో వివిధ వీడియోలు చూసి పలు రకాలుగా ప్రయత్నించి విఫలమవుతుంటారు.
కరీంనగర్‌కు చెందిన 25 సంవత్సరాల రాజేశ్ 90 కిలోల బరువు ఉన్నాడు. శిక్షకుడిని సంప్రదించకుండా బరువు తగ్గాలనుకొని తనకు తోచిన వ్యాయామాలు చేశాడు. ఆహారం తినడం తగ్గించాడు. కొన్ని రోజులకు అనారోగ్యం పాలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రవి అనే 23 ఏళ్ల యువకుడు సన్నగా ఉండటంతో బరువు పెరగాలనుకొని మార్కెట్లో దొరికే పౌడర్లు వాడాడు. జిమ్‌కు వెళ్లాడు. అయినా పురోగతి కనిపించలేదు. అనుకున్నది నెరవేరాలంటే సరైన వ్యాయామాలతో పాటు సరిపడా ఆహారమూ ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తీసుకోవాల్సిన ఆహారం..
- ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నం, రాత్రి 7 లోపు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తినాలి.
- రోజూ నానబెట్టిన పెసర్లు, గుడ్లు, శెనగలు, డ్రై ఫ్రూట్స్, ఓట్‌మీల్, పెరుగు, అరటి పండ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.
- కొవ్వు, నూనె పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ అసలే తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్‌లు (అన్నం, బేకరీ ఉత్పత్తులు, చక్కెర పదార్థాలు) తక్కువగా తీసుకుంటే మంచిది.
సన్నగా అవ్వండిలా..
- మానసికంగా ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో ఎక్కువగా తిని బరువు పెరుగుతారు.
- రోజూ చేసే శారీరక శ్రమ కంటే ఎక్కువగా చేస్తే శరీరంలోని కొవ్వు కరిగి, కేలరీలు ఖర్చయి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి.
- సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, వేగంగా నడవడం చేస్తే మంచిది.
- ఉదయం సుమారు 45 నిమిషాల నడవాలి.
- సాయంత్రం సమయాల్లో గంటకుపైగా జిమ్‌లోని పరికరాలతో వ్యాయామం చేయాలి. తక్కువ బరువుతో ఎక్కువ సెట్లు చేయాలి.
- కొత్తగా సాధన చేసేవారు ఏ రకమైన వ్యాయామం సురక్షితమో గుర్తించాలి. నొప్పులు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
- సరైన ఆహారం తీసుకుంటే మంచిది.