Bank Account Balance Details known to Cyber Criminals : రోజురోజుకు సైబర్‌నేరాలు మరింత విస్తృత రూపం దాలుస్తున్నాయి. కొత్త కొత్త ఎత్తుగడలతో కేటుగాళ్లు ప్రజలు జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల నల్లకుంటలో ఉండే ప్రైవేట్ ఉద్యోగి కొత్త ఇళ్లు కొనుగోలు కోసం ప్రైవేట్‌బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంకు నుంచి ఇంటికెళ్లేలోపు ఒకరు ఫోన్ చేసి బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకున్నాడు. గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆమోదం పొందాలంటే తాము పంపే లింకు క్లిక్ చేయాలని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మరొకరు ఫోన్ చేసి తెలుగులో మాట్లాడుతూ మోసగించేందుకు ప్రయత్నించాడు. ఖాతాదారు అవేవీ నమ్మకుండా బ్యాంకు అధికారులకు సమాచారమివ్వడంతో ఆదిలోనే మోసానికి అడ్డుకట్టపడింది.
అయితే ఇటీవల ఈతరహా ఫిర్యాదులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తిగత సమాచారం ఎలా బయటకు వస్తుందో వినియోగదారులకు అర్థంకావట్లేదు. గతంలో కేవలం పేరు, బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లు వంటి పాత సమాచారం ఆధారంగా సైబర్‌మోసాలు జరిగేవి. ఇటీవల కొంతకాలంగా రుణాలు, బీమా దరఖాస్తు వంటి వివరాలతో డబ్బు కొల్లగొడుతున్న ఫిర్యాదులు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బ్యాంకుకి రావాల్సిన అవసరం లేకుండా రుణాలు జారీచేస్తామని ప్రకటించడం ఖాతాదారులు తేలిగ్గా నమ్మి నేరగాళ్లకు దొరికిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. రుణం మంజూరు కోసం ఖాతాదారులు ఆశగా ఎదురుచూస్తుండటాన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా చేసుకొని మోసగిస్తున్నారు. రుణం వస్తుందనే తొందరలో నేరగాళ్లు చెప్పినట్లు చేసి ప్రజలు డబ్బు పోగొట్టుకుంటున్నారంటూ సైబర్ నిపుణులు చెబుతున్నారు.
థర్డ్ పార్టీ ఏజెన్సీలే కారణం : సైబర్ నేరగాళ్లు ఖాతాదారుల్ని లక్ష్యం చేసుకోవడానికి డేటా నిర్వహణలో బ్యాంకు డొల్లతనమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాతాదారుల ఆధార్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఫోన్ నంబర్లు వంటి డేటా, కాల్‌సెంటర్, రుణాల దరఖాస్తు ప్రక్రియ తదితర సాంకేతిక సేవల కోసం బ్యాంకులు థర్డ్ పార్టీ ఏజెన్సీలపై ఆధారపడతాయి. రుణం ఇవ్వడం బ్యాంకు పనే అయినా అందుకు సంబంధించిన సాంకేతిక పరిశీలన, దరఖాస్తు ప్రక్రియని థర్డ్‌పార్టీ ఏజెన్సీలు చూస్తుంటాయి. ఆ ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు ఎంతో కొంత ధరకు బయటివారికి వాటిని అమ్మేస్తున్నారు.