AP Police Involvement in Mumbai Actress Harassment Case :బాలీవుడ్ నటి అరెస్ట్ వ్యవహారంలో పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారని ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ముంబయి నటి, ఆమె కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సీడీ ఫైళ్లను సీపీ తెప్పించి పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులున్నట్లు గుర్తించారు. వీటిపై నివేదిక రూపొందించి డీజీపీకి అందజేశారు.
నేడు ఏపీ సీపీని కలవనున్న ముంబయి నటి :పోలీసు అధికారులపై నటి చేసిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా అధికారితో విచారణ చేయించాలని డీజీపీ ఆదేశించడంతో స్రవంతిరాయ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ముంబయి నటి ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ రానున్నారు. సీపీ రాజశేఖర్‌బాబును ఆయన కార్యాలయంలో కలవనున్నారు. విజయవాడ పోలీసులు తనను ఇబ్బంది పెట్టిన తీరును సీపీకి వివరించనున్నారు. అనంతరరం విచారణ అధికారి స్రవంతి రాయ్‌ను కలిసి తన వద్ద ఉన్న వివిధ పత్రాలు, ఆధారాలను అందించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఫిర్యాదుదారు అయిన వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనకు పంపిన అసభ్యకర చిత్రాలు, వీడియో కాల్స్ గురించి సమాచారాన్ని ముంబయి నటి ఇవ్వనున్నారు.
Mumbai Actress Suspicion on Arrest : ముంబయి నటిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు. జగ్గయ్యపేటలోని తన 5 ఎకరాల భూమి సొంతం చేసుకునేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి, మరుసటి రోజు ముంబయి వెళ్లి నిందితులను అరెస్టు చేయడంపై అనుమానాలున్నాయని ముంబయి నటి తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.