AP Govt Free Gas Cylinder Scheme :ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మహాశక్తి పథకం కింద పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ నుంచి అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కసరత్తు ప్రారంభించింది.
విధి విధానాలపై కసరత్తు :అనంతపురం జిల్లాలో మొత్తం 12,54,911 గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో దీపం, ఉజ్వల పథకాల కింద, ఇతర ప్రభుత్వ పథకాల కింద తీసుకున్న వారిలో తెల్లకార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తే 12,08,293 మంది కార్డుదారులున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణాల్లో ఉచిత వంట గ్యాస్ పథకం అమలవుతోంది. ఇందుకోసం ఏడాదికి ఎంత ఖర్చవుతోంది? ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు? విధి విధానాలపై పౌర సరఫరాలశాఖ కసరత్తు చేసి నివేదిక సిద్ధం చేసింది. శాసనసభ కమిటీలో మంత్రులు కూడా చర్చించి నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి విధివిధానాలను వెల్లడించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
12.54 లక్షల కనెక్షన్లు : ఉమ్మడి జిల్లాలో మొత్తం 12,54,911 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డుదారుల ప్రాతిపదికగా తీసుకుంటే ఇందులో 96 శాతం అంటే 12,08,293 కుటుంబాలకు పథకానికి అర్హత ఉంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలంటే రూ.105,06,10,763.50 ఖర్చవుతుంది.
ఏడాదికి ఒక్కో ఫ్యామిలీకి రూ.2,608 :సూపర్ సిక్స్ పథకాల హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు చంద్రబాబు ప్రకటించారు. అనంతపురంలో తాజాగా ఒక్కో గ్యాస్ సిలిండరు ధర రూ.869.50 ఉంది. మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో ఫ్యామిలీకి ఏడాదికి రూ.2,608.50 ప్రయోజనం చేకూరుతుంది.