Workers Medical Assistance Scheme in TG : దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బందిపడే కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. "వైద్య సహాయం" పేరిట ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి రూ.20,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. మరి, ఇందుకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దీన్ని నిర్వహించడానికి 'తెలంగాణ సంక్షేమ మండలి'ని ఏర్పాటు చేసింది. ఈ సంక్షేమ మండలిలో భాగం కావాలంటే ప్రస్తుతం ప్రతీ కార్మికుడు సంవత్సరానికి తన వాటాగా రూ. 2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీ యజమాని కార్మికుని తరపున రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుముని www.labour.telangana.gov.in సైట్‌కి వెళ్లి ఆన్లైన్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇలా మెంబర్ షిప్ తీసుకున్న కార్మికులకు, తెలంగాణ సంక్షేమ మండలి ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అందులోని ఒక పథకమే "వైద్య సహాయం".
అర్హతలు :
- దుకాణాలు/సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంఘాలు, ధర్మాదాయ, ఇతర ట్రస్టులలోనూ పనిచేసే కార్మికుడు/కార్మికురాలు, వారి భార్య లేదా భర్త, వారి పిల్లలు ఈ ఆర్థిక సాయం పొందడానికి అర్హులు.
- ఈ పథకం కింద కార్మికుడు/కార్మికురాలు సర్వీసులో ఒక వ్యాధి చికిత్సకోసం ఒకసారి సాయం పొందడానికి మాత్రమే అర్హులు.
- ఈఎస్ఐ(ESI) వర్తించే కార్మికులకు, యాజమాన్యం ద్వారా వైద్య సహాయం పొందే కార్మికులకు ఈ పథకం వర్తించదు.
ఏ జబ్బులకు ఆర్థిక సాయం పొందవచ్చంటే?
- క్యాన్సర్, కిడ్నీ, బ్రెయిన్ ట్యూమర్, గుండె జబ్బు, గర్భసంచి చికిత్స, ట్రామాకేర్ (ప్రమాదాలలో గాయాలకు చికిత్స), పక్షవాతం, ఎయిడ్స్ రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తారు.
- బాధితులకు రూ.20,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు.
- ఎయిడ్స్ చికిత్స కొరకు డాక్టరు వ్యాధి నిర్ధారణ పత్రం ఉంటే సరిపోతుంది. ఇతర పత్రాలు అవసరం లేదు.
- చికిత్స ప్రారంభించిన సంవత్సరంలోపు ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలి.
అవసరమైన పత్రాలు :
- దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- సంబంధిత వ్యాధికి చికిత్స చేసిన/చేస్తున్న డాక్టర్ సర్టిఫికెట్
- డిశ్చార్జ్ రిపోర్ట్
- హాస్పటల్, మెడికల్ బిల్లులు
- యాజమాన్యం, ఈఎస్ఐ నుంచి ఏ విధమైన సహాయం పొందలేదని తెలిపే ధ్రువీకరణ పత్రం
- బ్యాంక్ అకౌంట్ నంబర్
దరఖాస్తు విధానం :
- ముందుగా సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే అక్కడ దరఖాస్తు ఫామ్ ఇస్తారు.
- లేదంటే కార్మిక శాఖ అధికారిక వెబ్సైట్ (https://labour.telangana.gov.in/welfareFundAppls.do) లోకి వెళ్లండి.
- అక్కడ "Click Here to Download Welfare Scheme Application" అని కనిపిస్తుంది. దానిపై నొక్కితే సంబంధిత ఫామ్ కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్‌లో అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫామ్‌తోపాటు పైన పేర్కొన్న పత్రాలను దానితో జత చేయాలి.
- అనంతరం ఫామ్‌పై సంతకం చేసి స్థానిక కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లి సంబంధిత కార్మిక శాఖ అధికారికి అందజేయాలి.
- ఆపై మీరు దరఖాస్తు చేసినట్టుగా అధికారి వద్ద నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
- అనంతరం మీ దరఖాస్తును సంబంధిత పై అధికారులు విచారణ జరిపి అర్హులైన కార్మికుల బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తారు.
- ఇతర సందేహాలు, అదనపు వివరాల కోసం 040-27634045కి కాల్ చేయొచ్చు.
ఇవీ చదవండి :
చనిపోతే రూ.2 లక్షలు, గాయాలైతే రూ.50 వేల సాయం - 'హిట్ అండ్ రన్' స్కీమ్ గురించి మీకు తెలుసా?
కార్మికులకు వైకల్యం సంభవిస్తే ప్రభుత్వ సాయం - రూ.5 లక్షలు అందించే స్కీమ్ తెలుసా?