AIG Chairman Nageshwara Reddy ln AI : కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే బెంగ వైద్యుల్లోనూ ఉంది. కానీ దాని వల్ల వారి ప్రాధాన్యం తగ్గదు కానీ ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలు ఉన్నాయి. వైద్యనిపుణులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని కేవలం సహాయకారి మాత్రమే. వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవం సృష్టించబోతోందని, వ్యాధి నిర్ధారణ, చికిత్సలో కచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతోంది ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
మనిషి ఆలోచన కంటే అతి వేగంగా పనిచేసే సామర్థ్యంతో పాటు, ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ఏఐతో సాధ్యమని ఆయన వివరించారు. లక్షల సంఖ్యలో రోగుల డేటాను భద్రపరిచి, విశ్లేషించడంలోనూ ఏఐ కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. వైద్యులు గమనించలేని అతి సూక్ష్మస్థాయిలోనూ జబ్బును గుర్తిస్తుందని, ప్రమాదకరమైన జబ్బుల బారినపడే పరిస్థితులను మూడు నాలుగేళ్ల ముందే అంచనా వేస్తుందని వివరించారు. త్వరితగతిన నూతన ఔషధ ఆవిష్కరణలకు తోడ్పాటునందిస్తుందని చెప్పారు. జీవనశైలి మార్పులకు ఏఐ దిశానిర్దేశం చేస్తుందని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి వివరించారు.
నాగేశ్వరరెడ్డి: ఒక వైద్యుడు ఒక రోజులో అత్యధిక సంఖ్యలో ఎక్స్‌రేలు చూడడం సాధ్యపడదు. ఏఐ అయితే కేవలం అరగంటలోనే వెయ్యి ఎక్స్‌రేల రిపోర్ట్‌లను వేర్వేరుగా ఇచ్చే సామర్థ్యం ఉంది. ఇందులో 100 శాతం కచ్చితత్వం ఉంటుంది. రోగ నిర్ధారణలో వైద్యులు కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురయ్యే అవకాశాలుంటాయి. ఇలాంటప్పుడు రోగి వయసు, ఎత్తు, బరువు, వ్యాధి లక్షణాలు, పరీక్షల ఫలితాలు, తదితర వివరాలను ఏఐ పరికరంలో పొందుపర్చితే ఆ రోగికి ఏ జబ్బు ఉందని కచ్చితంగా చెబుతుంది.
వైద్యులు గుర్తించలేవిని కూడా గుర్తించి : ఉదాహరణకు ఒక వ్యక్తి జ్వరంతో మా దగ్గరికి వచ్చాడు. పరీక్షలు చేస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. రక్త పరీక్షలో కొన్ని ప్రొటీన్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. ఎక్స్‌రేలో అతి సూక్ష్మమైన వైద్యుడు చూసినా కూడా గుర్తించలేనంత ఒక చిన్న మచ్చ ఉంది. ఆ ఫలితాలను ఏఐ పరిశీలించి, ఆ వ్యక్తికి క్షయ అని నిర్ధారించింది. టీబీకి చికిత్స అందించగా నెల రోజుల్లోనే కోలుకున్నాడు. చర్మంపై ఏర్పడిన మచ్చను చూపిస్తే అది ఏ తరహా మచ్చనో వెంటనే చెప్పేస్తుంది. ఎండోస్కోపీలో ఆప్టికల్ బయాప్సీ విధానంలో జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన కణుతులను ఏఐ గుర్తిస్తుంది. సీనియర్ రేడియాలజిస్టులు గుర్తించలేని క్యాన్సర్ కణుతులను కొన్నేళ్ల ముందుగానే ఏఐ గుర్తించగలదు. ఏదైనా కణితి లేదా మచ్చ లేదా అనుమానిత ఫొటో చూపిస్తే దాన్ని ఏఐ అది చూసి క్యాన్సరా? కాదా? అనేది కూడా చెబుతుంది.
సర్జరీల్లో ఏఐ పాత్ర : సర్జరీల్లో ఎక్కువగా రోబోటిక్స్ వినియోగం పెరిగింది. ఏఐ ద్వారా కచ్చితత్వం, సమర్థత పెరుగుతాయి. ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యుల కంటికి కనిపించని అతి సూక్ష్మ రక్తనాళాలను పొరపాటున కత్తిరించే ప్రమాదం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పుడు అలాంటి వాటిని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మెదడు సర్జరీల్లో ఏఐ పాత్ర చాలా ప్రాధాన్యంగా ఉంటుంది. చికిత్స సమయం కూడా తగ్గుతుంది.
వ్యక్తిగత వైద్యచరిత్రను లోతుగా విశ్లేషించి సరైన చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి రక్త నమూనాల విశ్లేషణ ద్వారా మరో ఏడాది, రెండేళ్లలో ఆ వ్యక్తికి మధుమేహం, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉందా వంటి అంశాలను ఏఐ ద్వారా ముందస్తుగానే అంచనా వేయొచ్చు. కొందరు బాగా స్వీట్స్ తింటారు కానీ, ఊబకాయం రాదు. కొందరు తక్కువ మోతాదులో తిన్నా బరువు పెరుగుతుంటారు. ఇది జన్యువుల కారణంగానే జరుగుతుంది. ఆ జన్యుక్రమాన్ని విశ్లేషించి ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో సూచించడానికి వీలవుతుంది.
ఔషధాల తయారీకి : బీపీ, షుగర్, పల్స్, ఆక్సిజన్ శాతం ఇలాంటి వాటిని గుర్తించే ఉంగరాలు, వాచీల వంటి పరికరాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఏఐ విశ్లేషిస్తుంది. ఏ సమయంలో ఏ వైద్య సూచిక అసాధారణంగా ఉందనేది సూచిస్తుంది. దాన్ని బట్టి మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మందుల వేళల్ని సరిచేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక కొత్త ఔషధాన్ని కనుగొనడానికి 20 ఏళ్లకు పైగా పట్టేది. ఇప్పుడు ఏఐని వినియోగించి కేవలం రెండేళ్లలోనే కొత్త మందును కనిపెట్టడానికి అవకాశాలు పెరిగాయి. కొవిడ్ టీకాలన్నీ ఏఐ సహకారంతోనే త్వరితగతిన వెలుగులోకి వచ్చాయి.
ఏఐ మెడికల్ బెడ్ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏఐ మెడికల్ బెడ్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని మీద రోగి పడుకోగానే పల్స్, బీపీ, షుగర్, ఎలక్ట్రోలైట్స్, టెంపరేచర్, ఆక్సిజన్ శాతం తదితర పలు పారామీటర్లు వచ్చేస్తాయి. ఏవైనా మందులిస్తే ఆ వివరాలు కూడా రికార్డు అవుతాయి. ఈ రెండింటినీ కలిపి రోగి చికిత్స పురోగతిని ఏఐ చూపిస్తుంది. ఉదాహరణకు ఈ బెడ్‌పై ఉన్న రోగికి నిమిషానికి 20 చుక్కల చొప్పున శరీరంలోకి వెళ్లేలా సెలైన్ సీసా పెట్టారు. కొంతసేపటి తర్వాత అతడి శారీరక స్థితి మెరుగైతే ఆ చుక్కల సంఖ్యను తగ్గించవచ్చని ఏఐ సూచిస్తుంది. ఏయే మందులు ఎంత మోతాదులో ఇవ్వాలో కూడా తెలుపుతుంది.
రోగి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం : ఏఐ పరికరాలకు తప్పుడు సమాచారమిస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఏఐ వినియోగంపై ప్రభుత్వం నియమ నిబంధనలను రూపొందించాలి. డేటా భద్రత కూడా చాలా ముఖ్యం. రోగి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. డేటా దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలి. ఉదాహరణకు మెదడులో న్యూరోలింక్ అని ప్రత్యేక చిప్‌ను పెడుతున్నారు. పక్షవాతం రోగికి దీన్ని అమర్చడం ద్వారా కాళ్లు చేతులు కదిపేలా ఏఐతో రూపొందించారు. అయితే దీన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తి మెదడును తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రమాదమూ ఉంటుంది.
ఐ సేవ్ అనే సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి : ఐసీయూల్లో పల్స్, బీపీ, ఆక్సిజన్, ఇలా ఏడు రకాల పారామీటర్స్ నమోదు చేస్తుంటారు. పెద్ద ఆసుపత్రుల్లో రోజూ అయిదారుగురు రోగుల ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణిస్తుంది. అలాంటప్పుడు వ్యవస్థే వైద్యులను అప్రమత్తం చేస్తుంది. అత్యవసర వైద్య బృందం 4 నిమిషాల్లోపు అక్కడికి చేరుకొని చికిత్స అందిస్తుంటుంది. అయినా ఒకరిద్దరు పేషెంట్ల ఆరోగ్యం మరింత క్షీణించి, ప్రాణాలు పోయే పరిస్థితులుంటాయి. దీన్ని నివారించడానికి మేం ‘ఐ సేవ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాం. ఈ ఏడు రకాల పారామీటర్లలో ఐదు అసాధారణంగా మారగానే స్థానికంగా ఉన్న నర్సులను, వైద్యులను ‘ఐ సేవ్’ అప్రమత్తం చేస్తుంది. రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించకముందే సకాలంలో చికిత్స అందించడం వల్ల రోగి కోలుకుంటారు.
ఫ్యాటీ లివర్‌ను పరీక్షించడానికి ఫైబ్రో స్కాన్ చేస్తుంటాం. ఇది ఖరీదైనది. దీన్ని ఏఐ సాయంతో కేవలం రక్త పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్లు, లివర్ ఎంజైమ్ వంటి పరీక్షలు చేసి ఏఐ పరికరంలో పొందుపర్చడం ద్వారా ఫైబ్రో స్కాన్‌లో వచ్చినట్లే అదే కచ్చితత్వంతో రిపోర్ట్ ఇస్తుంది.
ఇంటెలిజెంట్ టాయిలెట్ అనేది హాంగ్‌కాంగ్‌లో అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూర్చుని మల విసర్జన చేస్తున్నప్పుడు బీపీ, షుగర్, పల్స్, ఎలక్ట్రోలైట్స్ తదితర సమాచారాన్ని అందిస్తుంది. ఏ రకమైన ఆహారాన్ని తినాలి? నిద్ర సరిపోయిందా? లేదా? అనేది కూడా తెలుపుతుంది.
'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్'- ఇకపై AI టెక్నాలజీ మరింత యూజ్‌ఫుల్!
హైదరాబాద్‌లో వరద మాటే వినపడొద్దు! - ఏఐని రంగంలోకి దింపిన బల్దియా
ఏఐ హబ్‌గా మారనున్న హైదరాబాద్ - రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎంఓయూలు