AP Cabinet Approves Mega DSC : ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహా అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తీసుకోవాల్సిన పలు నిర్ణయాలపై చర్చిస్తున్నారు.
మరోవైపు ఏపీలో మెగా డీఎస్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చర్చల్లో భాగంగా కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలు తీసుకువచ్చారు. డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్‌ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదించింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ రూ.4 వేల పెంపు సహా పెండింగ్ బకాయిలు కలిపి జులై 1న ఇంటివద్దే రూ.7 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది.
AP Cabinet Meeting 2024 :మరోవైపు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున నెలకు రెండు పర్యాయాలు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సాంప్రదాయాన్ని తిరిగి పునరిద్దరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సంతకం చేసిన 5 దస్త్రాలతో పాటు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జరగాల్సి ఉన్న అసెంబ్లీ సమావేశాలు, వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల వంటి కీలక అంశాలపై మంత్రివర్గంలో కీలకచర్చ జరుగుతోంది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.