Girl Dies of Snake bite in Vikarabad : రాత్రి సమయంలో పాము కాటుకు గురై ఆపదలో ఉన్న బాలికకు ఆధార్ కార్డు లేదని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది నిరాకరించారు. ఫలితంగా ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ మండలం నందారంలో సంచార కుటుంబానికి చెందిన బుడగ జంగం సంగీత, దివ్యాంగురాలైన ఆమె తల్లి రంగమ్మలు భిక్షాటన, కూలీ పనులు చేస్తూ గ్రామంలోని ఓ పాత భవనంలో నివాసం ఉంటున్నారు.
శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భోజనం చేసి పక్కనే ఉన్న గోడ మీద సంగీత చేయిని పెట్టింది. అక్కడే ఉన్న పాము ఆమెను కాటేసింది. ఆమె పెద్దగా అరిచి తల్లికి చెప్పడంతో చుట్టుపక్కల వారి సాయంతో 108 సమాచారమిచ్చారు. అంబులెన్స్ 10.30 గంటలకు వచ్చింది. తల్లి వెంట రాగా, సంగీతను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తాండూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి కుదుటపడలేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో రంగమ్మ స్థానికుల సహాయంతో మరో 108 అంబులెన్సుకు సమాచారమిచ్చారు. దాదాపు గంటసేపు తర్వాత అంబులెన్స్ వచ్చింది.