Amazon Former Employee Fraud And Arrested : అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.22 కోట్ల మేర కొట్టేసిన వ్యక్తిని సైబరాబాద్ ఆర్ధిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. సంస్థలో పనిచేసి రాజీనామా చేసిన మాజీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల పేరిట నిధులు పక్కదారి పట్టించి వచ్చిన డబ్బంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. అమెజాన్ సంస్థ ఆర్థిక అవకతవకలను గుర్తించి సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే? :సరూర్‌నగర్‌కు చెందిన ఎం.వెంకటేశ్వర్లు గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలోని అమెజాన్ క్యాంపస్‌లో 2015లో ఉద్యోగంలో చేరాడు. సీనియర్ ఫైనాన్షియల్ ఆపరేషనల్ అనలిస్ట్ హోదాలో అమెజాన్ ఇండియా ఉద్యోగుల పేరోల్, సంస్థ నుంచి బయటకు వెళ్లిన వారి బకాయిల చెల్లింపులకు సంబంధించి సెటిల్‌మెంట్ వ్యవహారాలు పర్యవేక్షిస్తుంటాడు. సంస్థ ఉద్యోగుల వేతన వ్యవహారాలు చూసే వెంకటేశ్వర్లుకు చెల్లింపులు, క్లెయిముల పరిష్కారంపై పూర్తి అవగాహన ఉంది. ఈ క్రమంలోనే సంస్థను వీడిన మాజీ ఉద్యోగుల్లో కొందరు దీర్ఘకాలంగా తమ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు, క్లెయిమ్ చేసుకోలేదని గుర్తించాడు.
To Take Unclaimed Money Of Employees :క్లెయిం చేసుకోని సంస్థ మాజీ ఉద్యోగుల డబ్బును తాను కాజేయాలని పథకం వేశాడు. బకాయిలు చెల్లించాలంటూ మాజీ ఉద్యోగుల పేర్లతో తానే దరఖాస్తు, క్లెయిము చేయించాడు. ఇలా దరఖాస్తు చేయించిన తర్వాత మాజీ ఉద్యోగి బ్యాంకు ఖాతా బదులు తనకు సంబంధించిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు అందులో నమోదు చేసేవాడు. చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని తన కింది సిబ్బందికి సూచించేవాడు. ఆ తర్వాత సంస్థ ఆమోదం రాగానే నగదు బదిలీ అవుతుంది.
నకిలీ అభ్యర్థనలతో రూ.3.22 కోట్లు స్వాహా :నిందితుడు వెంకటేశ్వర్లు 2016- 2023 మధ్య 184 మంది పేర్లతో నకిలీ అభ్యర్థనలు పెట్టి మొత్తం రూ.3.22 కోట్లు దారి మళ్లించాడు. ఈ సొమ్మంతా తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాడు. ఈ తప్పుడు లావాదేవీలు ఎవరూ గుర్తించకుండా బ్యాంకు ఖాతా వివరాలు బయటకు పొక్కకుండా రికార్డులను చెరిపేసేవాడు. ఇటీవల అమెజాన్ అంతర్గత దర్యాప్తు బృందాలు ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని అవకతవకలు జరిగినట్లు గుర్తించాయి.