Natural Beauties of Nallamala : ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో టూరిస్టులు, ప్రకృతి ప్రేమికులకు మరో ఆహ్లదకరమైన పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మన్ననూరు జంగిల్ రిసార్ట్, టైగర్ స్టే ప్యాకేజికి (ఫర్హాబాద్ టూరిజం ప్యాకేజి)కి తోడు సోమవారం(జనవరి 13) నుంచి దోమలపెంటలో అక్కమహాదేవి స్టే ప్యాకేజీ(గుహలు) రారమ్మంటున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఇక్కడ సఫారీని ప్రారంభించారు.
ఆన్‌లైన్ బుకింగ్ : ఆసక్తిగల టూరిస్టులు www.amrabad tiger reserve.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి తమకు నచ్చిన రోజును ఎంపిక చేసుకోవచ్చు. పర్యాటకులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు దోమలపెంటలోని అటవీ శాఖ వనమయూరి గెస్ట్ హౌస్‌కు చేరుకోవాలి. 3 గంటలకు చెక్‌ఇన్ అయిన టూరిస్టులను 3.30 గంటలకు అక్టోపస్ దృశ్యకేంద్రానికి స్పెషల్‌గా వాహనంలో తీసుకెళ్లుతారు. అక్కడ కృష్ణానదిలోకి చొచ్చుకొచిన అక్టోపస్‌లాగా అడవి ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది.
జంతువులు, పక్షుల కనువిందు : అనంతరం వజ్రాల మడుగు కేంద్రానికి తీసుకెళాతారు. అక్కడి వాచ్ టవర్ పైనుంచి వంపులు తిరుగుతు వెల్లే వయ్యారాల కృష్ణానది అందాలను స్పష్టంగా వీక్షించొచ్చు. అక్కడి నుంచి రాత్రి విశ్రాంతి కోసం గెస్ట్ హౌస్‌కు తీసుకెళతారు. తరువాతి రోజు ఉదయం 6 గంటలకు శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న అక్కమహాదేవి గేట్ నుంచి సుమారు 5 కిలో మీటర్ల లోపల ఉన్న గుహలకు, దట్టమైన అడవి గుండా అక్కమహాదేవి గుహలోని ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. కాలి నడకన వెళ్లే సమయంలో పర్యాటకులను వివిధ రకాల యానిమల్స్, పక్షులు కనువిందు చేసే అవకాశాలు ఉన్నాయి.
పరమేశ్వరుడి దర్శనం : అనంతరం కొండ దిగువన కృష్ణానది ఒడ్డన ఉన్న అక్కమహదేవి గుహలకు చేరుకొంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ పెద్ద శిలాతోరణం, అక్కమహాదేవి తపస్సు చేసిన చిన్న గుహ, అందులోని ఆ పరమేశ్వరుడి శివలింగాన్ని దర్శించుకోచ్చు. గుహలో ప్రయాణం చాలా సాహసంతో కూడికొని ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి మద్యాహ్నం 12 గంటలకు మళ్లీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.