Akka Mahadevi Caves Stay Package : ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. దోమలపెంట అక్కమహాదేవి స్టే ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆన్‌లైన్‌లో బుకింగ్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా తీరాన ఉన్న అక్కమహాదేవి గుహలు దోమలపెంట స్టే ప్యాకేజీని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ప్రారంభించారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న గుహల సందర్శన పర్యాటకులకు మధురానుభూతిని మిగల్చుతుంది. 2 రోజులు సాగే ప్యాకేజీ కోసం పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటి రోజు ఇలా :దోమలపెంట అక్కమహాదేవి పర్యటనలో మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు దోమలపెంట అటవీ శాఖ ఆఫీస్ వద్ద ఉన్న వనమయూరి అతిథి గృహంలోని బుక్ చేసుకున్న రూమ్‌కి చేరుకోవాలి. అనంతరం పర్యాటకులను దోమలపెంట దగ్గరలోని వజ్రాల మడుగు, ఆక్టోపస్ వ్యూపాయింట్లకు వాహనాల్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత నైట్ భోజనం తీసుకుని విశ్రమిస్తారు.