Effect Of Floods in Telangana :రాష్ట్రంలో జోరు వానలకు ప్రజలు ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారి చెరువును తలపించింది. మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్‌లోని ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, కైరిగూడ, రామకృష్ణాపూర్‌లోని ఉపరితల గనుల్లో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నీటిని మోటార్ల సాయంతో సింగరేణి అధికారులు వెలికితీస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడు చెరువు మత్తడి వల్ల సత్యనారాయణ పురం- ఇల్లందు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందులో బుగ్గవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ స్టేషన్ బస్తీలోని ఇళ్లను చుట్టుముట్టింది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పోలీసులు తాళ్ల సాయంతో బాధితులను పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కిన్నెరసాని ప్రభావంతో గుండాల-కొడవటంచ మధ్య గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కారేపల్లి మండలం పేరేపల్లి వద్ద బుగ్గవాగు ప్రవాహం ధాటికి డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి వరద ప్రవేశించింది. పోలీసులు అవగాహన కల్పించి వాహనాలు ఏర్పాటు చేసి వారి సామాన్లనతో సహా పునరావాస కేంద్రాలకు తరలించారు.
అధిక వర్షాలతో అతలాకుతలమైన సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి, సీపీ అనురాధ పరిశీలించారు. వరద కష్టాలతో లోతట్టుప్రాంతాల ప్రజలు పడుతున్న కష్టాల్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రభుత్వపరంగా ఆదుకుని అండగా నిలుస్తామని అభయమిచ్చారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై యంత్రాంగం దృష్టిసారించాలని సూచించారు.
ఎవరిని కదిపినా ఒకటే వ్యథ - ముంపు బాధితులందరిదీ అదే కన్నీటి గాథ - MUNNERU FLOOD VICTIMS PROBLEMS